తెలుగు సాహిత్యం మీద ఆసక్తి పెరగడానికి నాటి ఉపన్యాసం కూడా ఒక కారణం అని చెప్పాలి.ఆ రోజు జరిగిన కవిసమ్మేళనంలో డాక్టర్ పల్లా దుర్గయ్య గారు,చలమచర్ల రంగాచార్యులు గారు కవితలు వినిపించారు. మా తెలుగు మాస్టారు శ్రీ.తిగుళ్ళ వేంకటేశ్వర శర్మగారు మమ్ములును ఎంతో ప్రోత్సహించేవారు.అంతకు ముందు ఉన్న కృష్ణమూర్తి మాస్టారు గారు నా చేతివ్రాత బాగుంటుందని నన్ను వాళ్ళ ఇంటికి పిలిచి, మా స్కూల్ గ్రంధాలయం పుస్తకాల పట్టికను నాచేత కేటలాగ్ గా రాయించి పాలు,అరటిపళ్ళు ఇచ్చిన వైనాన్ని ఎలా మరువగలను.హెచ్.ఎస్.సి 1965 లో పాసయ్యి, పి.యు.సి.లో వివేకవర్థనీ కళాశాలలో చేరాను.అక్కడ నిడదవోలు వెకటరావ్ గారి తెలుగు పిరియడ్ ఒక్కటే బాగా నచ్చేది.ఒక్కసారిగా తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంలోకి మారినందువల్ల చాల ఇబ్బందిగా ఉండేది.అందులోనూ సైన్స్ తీసుకున్నానాయె. నాకు కవిత్వం మీద ఆసక్తి ఏర్పడి కవితలు రాయడం మొదలుపెట్టాను.1967 అక్టోబర్ 17 న వై.ఎం.సి.ఏ. నారాయణగూడా లో నవ్య సాహితీ సమితి ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనంలో ఆహుతుల సమక్షంలో నా కవిత వినిపించి కరతాళధ్వనులు అందుకోవడం గుర్తే.ఆ రోజు నాతో బాటు కాళోజీ నారాయణరావ్,జైనుల్లాబుద్దీన్,పరాశరం గోపాల కృష్ణమూర్తి కవిసమ్మేళనం లో పాల్గొన్నారు.శ్రీ వరికొండ రామచంద్రరావ్ గారి 'మనసులూ-మర్మాలూ 'అనే కథా సంకలనం నాటి సభలో శ్రీ.పి.వి.రాఘవరావ్ ఆవిష్కరించారు.
ఇంతకీ చెప్పవచ్చే సంగతి నాటి కవి సమ్మేళనంలో నేను చదివిన కవిత 'నే రాస్తా ' అనేదే 'నవ్య వాణి ' మాసపత్రిక ఫిబ్రవరి '1968 సంచికలో అచ్చైన నా మొదటి కవిత.అది తలుచుకోవడం ఎప్పటికీ సంతోషం కలిగించే తరుణం.
No comments:
Post a Comment