ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Tuesday 28 June 2016

అమ్మమ్మ



నిన్నటికి కనుమరుగై మూడేళ్ళయిన తన అమ్మమ్మ ను తలుచుకుంటూ మా అబ్బాయి చి.స్నేహిత్ తెలుగులో రాసిన స్మృతి వీచిక ఇది..మీ తో పంచుకోవాలనిపించింది. అంతే........!





అమ్మమ్మ

అమ్మమ్మ..
నువ్వు వెళ్ళిపోయి ౩ సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం ఆగలేదు. మన గది మారలేదు. కానీ నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా నువ్వు లేని లోటు తెలుస్తూనే ఉంది. నీ అల్లికలు, కుట్లు లాగే జీవితం తో నీ జ్ఞాపకాలు అల్లుకుపోయాయి.
అమ్మ నాన్నగారు తో పాటు నాకు బలం అయిన అమ్మమ్మ..
అమ్మా నాన్నగారు ఇంట్లో లేనప్పుడు నాకు ఇద్దరూ అయిన అమ్మమ్మ..
అమ్మా నాన్నగారు తిట్టినప్పుడు వాళ్ళ ప్రేమ గుర్తుచేసిన అమ్మమ్మ..
చిన్నప్పుడు నువ్వు పెట్టుకునే నామం బొట్టు నుంచి నువ్వు కప్పుకునే చిన్న రగ్గు వరకు నాకు అన్ని ఉత్సుకతే. అమ్మమ్మబీరువా లాకర్ లో ఎమున్నాయి? ఆ చిన్న చిన్న పర్సుల్లో ఎన్ని చిన్న చిన్న ఖజానాలు ఉండేవో !!
వడిలో కుర్చోపెట్టుకుని కబుర్లు కథలు చెప్పిన అమ్మమ్మ..
గోరు ముద్దలు కలిపి నోట్లో పెట్టి, “మంచినీళ్లు” అని నేను బొటను వేలు ఎత్తి దించే లోపల గ్లాసులో నీళ్ళు తెచ్చే అమ్మమ్మ..
1
Ammamma and Me – Childhood
వేసవి సెలవుల్లో రోజంతా  క్రికెట్ ఆడి వస్తే చల్లగా నువ్వు కలిపిచ్చిన నిమ్మకాయ రసం..స్కూల్ నుంచి వచ్చాక నీతో కూర్చుని ఋతురాగాలు చూడడం ( నీలాగా కళ్ళు చిన్నవి చేసుకుని టీవీ చూస్తేనే కదా నాకు కళ్ళజోడు వచ్చింది మరి!) ..అది అయ్యాక దొంగ చాటుగా టీవీ వీడియో గేమ్ తీసి ఆడుకుంటుంటే నువ్వు బాల్కనీ లో నాకోసం అమ్మా వాళ్ళు ఎప్పుడొస్తారో అని చూస్తూ, వాళ్ళు రాగానే నాకు చెప్తే నేను మళ్లీ అది అటక మీద పెట్టేయడం..
క్యారొమ్బోర్డ్, చైనీస్చెక్కర్, అష్టా చమ్మ, చెస్..ఎప్పుడు  మనిద్దరమే జట్టు.అదే నీకు ఎప్పుడైనా కోపం వచ్చి “నీ దోస్త్ కటీఫ్!!”  అంటే , ఏడ్చి నీ చేత మళ్లీ “దోస్త్” అనిపించుకునేంత వరకు  నిన్ను సతాయించడం..
నువ్వు పడుకున్న మడత మంచం అరిగిపోయింది,
నువ్వు హరి గారి కొట్టులో సామాన్లు కొనడం కోసం తాడు కట్టి బాల్కనీ లోంచి కిందకి వేసిన బుట్ట విరిగిపోయింది..
నువ్వు కూర్చునే ఈజీ ఛైర్ గుడ్డ చిరిగిపోయింది..
కానీ,
కరెంట్ పోయినప్పుడు నువ్వు విసినికర్ర తో నాకు విసిరిన గాలి ,
ఎండాకాలంలో నువ్వు మొహం నిండా పాండ్స్ పౌడర్ రాసుకునేలా చేసిన ఎండ,
పీడకల వస్తే నిద్ర లో నువ్వు అరిచేలా చేసిన చీకటి,
డెబ్భై ఏళ్లు నీ ఆహారం గా నీకు తోడుఉన్న నీళ్ళు,
పాత జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకుని రాత్రి నీకు వచ్చిన దు:ఖం,
రాత్రి బాత్‌రూమ్ కి వెళ్ళాలి అంటే నిన్ను లేపి తోడు తీసుకెళ్లే లా చేసిన భయం
నీకు ఏం అవ్వకుండా  నిన్ను జాగ్రత్త గా చూసుకోవాలన్న అమ్మ తాపత్రయం,
నీకు  ఏం జరిగినా  నిన్ను చేతులతో ఎత్తుకుని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లిన నాన్నగారి గుండె బలం, ధైర్యం,
అన్ని అలాగే ఉన్నాయి. ప్రతీదీ నిన్నే గుర్తుచేస్తాయి.
3
Ammamma and me : Teens!
అమ్మమ్మ..
నలుగురూ ఎప్పుడు చుట్టూ ఉంటేవాళ్ళకి “హిస్టరీ” చెప్పిన అమ్మమ్మ..
ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ గుర్తుండిపోయిన అమ్మమ్మ ..
ఒక . తాతగారిని పెంచిన అమ్మమ్మ, ఇంకో .తాతగారి ముందు తలవంచిన అమ్మమ్మ,
తనకంటూ ఒక గుర్తింపు, స్థాయి, పేరు తెచ్చుకుని అవి నిలబెట్టుకోవడానికి కష్టపడని అమ్మమ్మ,
అయిన వాళ్లకోసం ఎదురు చూసిన అమ్మమ్మ, కాదనుకున్న వాళ్లని  కేకలేసిన  అమ్మమ్మ,
“తిన్నావా అమ్మమ్మా!” అని అడిగితే కంట తడిపెట్టి ముద్దులు పెట్టుకున్న అమ్మమ్మ..
నేను పెద్దవుతున్న కొద్ది మన మధ్య దూరం పెరిగినా, నేను ఎప్పుడు నిన్ను తలచుకుంటూనే ఉన్నాను. అక్కలు, అన్నలు అందరు “వాడే నీకు favorite” అంటే గర్వంగా అనిపిన్చేది. వాళ్ళు చూసిన అమ్మమ్మ వేరు, నేను చూసిన అమ్మమ్మ వేరు. ఆ అమ్మమ్మ సంసారబంధాల్లో ఇరుక్కుని, పిల్లలని, మనవళ్ళు మనవరాళ్ళని, అత్తగారిని, అందరినీ చూసుకుంటూ, కుక్కలని పిల్లుల్నిపెంచుతూ తనని తాను మరిచిపోయిన అమ్మమ్మ. నా అమ్మమ్మ నా కోసమే నాకు తోడు గా, అండగా,తన అనుభవాలను నాకు పాఠాలుగా, తన జ్ఞాపకాలను నాకు అనుభూతులుగా , కల్పనలు గా, కలలుగా వదిలి వెళ్ళింది. తన చిన్నప్పటి దెయ్యాల కధలు, తన జీవితం లో తను చేసిన తప్పులు, కోల్పోయిన సమయం, మోసం చేసిన మనుషులు, పోగొట్టుకున్న గౌరవం,అమర్చుకున్న ప్రపంచం, వదిలేసిన కోరికలు, కూడగట్టుకున్న బంధాలు, అన్ని నాకుతెలుసు. రోజూ పొద్దున్న ,సాయంకాలం అమ్మమ్మ సత్సంగం చేసుకోవడమనేదే కాదు. అలానే ఆఖరి దాకాను.
Facetime లో “లక్ష్మి బై” అని పిలిస్తే నవ్వి “వస్తున్నాను” అని వచ్చి మాట్లాడిన క్షణాలు, నేను అమ్మమ్మ ఇద్దరమే కలిసి లాంగ్ డ్రైవ్ మీద వెళ్ళిన రోజు, నాకు ఎప్పటికీ గుర్తుండి పోతాయి . అంత్యదశ లో తన దగ్గర లేను, కానీ తన ఆఖరి క్షణం లో నేను తన దగ్గర వుండి బాధపడకుండా, ఆఖరి చూపుకి మాత్రమే ఉండేటట్టు గా ప్లాన్ చేసింది అమ్మమ్మ.
I miss you అమ్మమ్మ!! We all do.
Screen Shot 2016-06-14 at 5.59.51 PM
Ammamma in prayer : Pic courtesy – Preetam Emani
Screen Shot 2016-06-14 at 8.41.16 PM
Ammamma’s hand working their magic
Screen Shot 2016-06-14 at 8.39.44 PM
Ammamma resting on a Cold winter night

No comments:

Post a Comment