ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Monday, 25 April 2011

విద్యార్థి కవులపై శశాంక వ్యాసం



ప్రముఖకవుల గురించీ,వారి కావ్యాల గురించీ వ్యాసాలు రాసేవారు వుంటూనే వుంటారు.ఇక ఒక నాటి తరం సాహితీవేత్తల గురించి వారి జయంతులకో,వర్థంతులకో పత్రికలలో నివాళి వ్యాసాలో,స్మారక రచనలో వెలువడుతూ వుండడం కూడా కద్దు. కానీ వర్థిష్ణులైన కొత్త కవుల గురించి పట్టించుకునే పెద్దలు తక్కువ.తమ శిష్యులుగా భావించిన వారిని ప్రోత్సహించడం చేసినా,మహా అయితే వారి పుస్తకానికి ఏ ముందుమాటో వ్రాసి ఆశీర్వదించడం చేస్తారుగాని వారిపై వ్యాసం ఏ పత్రికకో ,సంచికకో వ్రాసేవారు కూడా తక్కువే.అందునా ఒక ప్రముఖ కవి ఒక కుర్రకవిని గురించి రాయడం గతంలో మరీ తక్కువ.


కవి గా కాక ప్రముఖ విమర్శకునిగా ఖ్యాతి గాంచిన 'చే.రా '(శ్రీ.చేకూరి రామారావు గారు)ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో తన 'చేరాతలు ' కాలం లో యువకవులను (ముఖ్యంగా కవయిత్రులను) గురించి రాసారు.


కానయితే తాను ప్రముఖ కవి గా పేరుపొందిన దశలోనే కీ.శే. శ్రీ శశాంక గారు,చాలా కాలం క్రితమే , విద్యార్థులుగా వుండి కవిత్వం రాస్తున్న యువతను ప్రోత్సహిస్తూ వ్యాసం రాయడానికి ఒక ఒరవడి పెట్టారనిపిస్తుంది.

1971 లో మే 30,31, జూన్.1 తేదీలలో మూడు రోజులపాటు హైదరాబాద్ లో అయిదవ అఖిలభారత ప్రపంచ మహా సభలు పెద్ద ఎత్తున జరిగాయి. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నకాసు బ్రహ్మానంద రెడ్డి గారు చైర్మెన్ గా జరిగిన ఆ సభలను ప్రముఖ శాస్తవేత్త సూరి.భగవంతం గారు ప్రారంభించగా, అప్పటి విద్యాశాఖామంత్రి పి.వి.నరసింహారావు గారు సాహితీ సదస్సులను ప్రారంభించారు. అప్పటి సమాచార శాఖామంత్రి అక్కిరాజు వాసుదేవరావు గారు పుస్తక కళా ప్రదర్శనను ప్రారంభించారు.శ్రీ.దామోదరం సంజీవయ్య గారు రచయితల మహాసభల అధ్యక్షులు కాగా, ప్రధాన కార్యదర్శిగా శ్రీ.పోతుకూచి సాంబశివరావు గారు వ్యవహరించారు.



అయిదవ అఖిల భారత తెలుగు రచయితల మహాసభల రిసెప్షన్ కమిటి ఎక్జ్ క్యూటివ్ కన్వీనర్లలో ఒకడిగానూ,పుస్తక,కళాప్రదర్శన కమిటీ సభ్యులలో ఒకడిగానూ నేనూ పనిచేయడం మరపురాని సంగతి.







ఇంతకీ చెప్పవచ్చిన సంగతి ఆ సందర్భంగావెలువడిన సావనీర్ లో మా అందరికీ ఆశ్చర్యాన్నీ ,ఆనందాన్నీ కలిగిస్తూ శశాంక గారు 'విద్యార్థి కవితారంగం- కొంతమంది విద్యార్థి కవులు ' అంటూ ఒక వ్యాసం వ్రాసారు.అందులో మొదటే నా గురించి రాసారు.ఆ రోజు ఆయన వ్యాసంలో పేర్కొన్న వాళ్ళం లో ఒక కపిల రామమోహనరావు మినహా మిగితా అందరమూ నేటికీ కవులుగా నిలబడడం జరిగింది.చెబితే స్వోత్కర్ష అవుతుంది గానీ మీరే వ్యాసం చదవండి,నా గురించి ఆయన ఏమన్నదీ.అది నాడు ఆయననుండి అక్షరాలా అందిన గొప్ప కితాబుగా భావిస్తాను.ఆ మాటే మా దేవరాజు మహరాజూ అంటూవుంటాడు.ఆ సావనీర్ లో 'కవిత-యువ రచయితలు ' అనే నా వ్యాసమూ ప్రచురితమైంది.కానీ శశాంక గారు ఈ వ్యాసం రాయడం ద్వారా కలిగించిన ప్రోత్సాహం ఎప్పుడూ ఒక గొప్పగా తలుచుకునే తరుణం.










No comments:

Post a Comment