ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Saturday, 7 May 2011

గుర'జాడ'దగ్గర




 ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ....
  అన్నది ఎప్పటికీ కటిక వాస్తవం.

  భవిష్యత్తు వర్తమానంలోకి దిగుతుంది.
  వర్తమానం గతమై పోతుంది.
  కొన్ని నామరూపాలు కేకుండా నశించిపోయి చరిత్రగా మిగులుతాయి.


  ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే
  తెలుగు వైభవప్రాభవాలను కళ్ళముందు నిలపడానికి
  పూర్వ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావ్ గారు
  హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద
  తెలుగు ప్రముఖుల విగ్రహాలను కొన్ని ప్రతిష్టింప చేశారు.


  వాటిల్లో తొలి తెలుగు కథానిక రాసిన,
  'కన్యా శుల్కం ' నాటకం తో సుప్రసిద్ధులైన గురుజాడ అప్పారావు గారి విగ్రహం ఒకటి.

  వేదగిరి కమూనికేషన్స్ ద్వారా
  తెలుగు కథానిక పై అనేక సదస్సులు,తెలుగు కథా వికాస గ్రంథాలు వెలువరించిన
  శ్రీ వేదగిరి రాంబాబు
  నూరేళ్ళ తెలుగుకథ అంటూ కథకు వందేళ్ళ పందుగను రాష్త్రమంతటా
  జిల్లాలవారీగా 2010 లో సమాపనోత్సవాల పర్యంతం
  ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి నిర్వహించాడు.


  విజయనగరం లో గురజాడ ఇంటి ని స్మారకనిలయంగా వికాసవంతం చేయడంలోనూ
  ప్రధాన పాత్ర వహించాడు.


  అయితే తమాషాగా గురజాడ వారి విగ్రహం
  ట్యాంక్ బండ్ మీద వున్న విషయం తనకు చాలా కాలం తెలియనేతెలియదని తనే అన్నాడు.

  తెలిసాక మాత్రం
  గురజాడ జయంతి అయిన 21 సెప్టెంబర్'2010 నాడు పొద్దున్నే ఫోన్ చేసి
  ఆయన జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహానికి దండ వేసి,
  గురజాడ వారు 1914 లో ఇంగ్లీష్ లో రాసి ప్రచురించిన 'డిస్సెంట్ పత్రం' పునర్ముద్రణ చేసి,
  గ్రంథ ఆవిష్కరణ అక్కడే చేద్దామని పిలిచాడు.

  మా కాలనీ లోనే శ్రీ. విహారి గారు కూడా వుంటారు కనుక
  ఇద్దరమూ కలసి వెడదాము అనుకున్నం.
  ఇంతలో చైతన్య పురి లో వుండే శ్రీ. పోరంకి దక్షిణా మూర్తి గారు
  దారేకనుక ముగ్గురం కలసి వెడదామని ఆటోవేసుకు వచ్చి
  మా ఇద్దరినీ ఎక్కించుకువెళ్ళారు.

  విగ్రహానికి దండ వేయడానికివీలైన  సౌకర్యం  కూడా లేదు.
  మొత్తానికి అక్కడే దగ్గర హోటల్ వాడి నుంచి ఒక నిచ్చెన ,పెద్ద బొంగు సంపాదించి, విగ్రహం వేదిక పైకెక్కి
  గురజాడ మెడలో దండ వేశాం.

  శ్రీ పోరంకి వారే కొత్త ఎడిషన్ కు ముందు మాట రాసిన
  గురజాడ 'డెస్సెంట్ పత్రం' డమ్మీ ప్రతిని అక్కడే ఆవిష్కరించి, ప్రసంగించారు.
  వేదగిరి రాంబాబు ఇకపై ఆ స్థలం వద్ద గురజాడను స్మరించే కార్యక్రమం కొనసాగించాలన్న
  అభిప్రాయం కూడా ప్రకటించాడు.
  నాటి సమావేశాన్ని పత్రికలు కూడా వివరంగా కవర్ చేశాయి.

  ఎవరనుకుంటారు
  అదే ఆ గురజాడ విగ్రహం దగ్గర చివరి సమావేశం అవుతుందని.
  మనుషుల కే దిక్కులేదు.
  విగ్రహాలూ శాశ్వతమన్న భ్రమ ఎందుకు.
  తెలంగాణా ఉద్యమ తీవ్రతలో
  మిలియన్ మార్చ్ సందర్భంగా
  ఆ గురజాడ విగ్రహాన్ని ఆందోళన కారుల్లో కొందరు సుత్తులతో కొట్టి.తాళ్ళతో లాగి పడద్రోసి
  ట్యాంక్ బండ్ లో లో నిమజ్జనం చేసేసారు.

  2010 లో పునర్ముద్రణ చేసిన 1914 నాటి గురజాడ వారి డిస్సెంట్ పత్రం పుస్తకం అట్ట  వెనుక
  ఆ నాటి ఫొటొ
  ఇప్పుడు ఒక 'స్మృతి ' గాతలుచుకునే
  అమూల్య క్షణం గా మాత్రం మిగిలింది.
   ఆ పుస్తకం ఇప్పుడు విడుదలైంది.
   అట్ట మీద ఫొటో పైనే చూసారుగా.
   ఇప్పుడు చరిత్రాత్మకం అయిన ఆ నాటి మా  ఫొటో ఇదిగో.

   21.9.2010 న గురజాడ  వారి జయంతి సందర్భంగా
   హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద అప్పుడు  వున్నవిగ్రహం దగ్గర తీసిన ఈ ఫొటోలో
   ఎడమ నుంచి కుడికి వున్నవారు:
   శ్రీమతి.డాక్టర్.వాసా ప్రభావతి, శ్రీమతి.పొత్తూరి విజయలక్ష్మి , శ్రీ.విహారి, డాక్టర్.వేదగిరి రాంబాబు ,
   డాక్టర్.పోరంకి దక్షిణా మూర్తి, సుధామ, శ్రీ. శివప్రసాద్.
 

1 comment:

  1. ఎవరో జ్వాలను రగిలించారూ! వేరెవరో దానికి బలి ఐనారూ!
    అనవసర ఆవేశాలు అరాచకానికి కారణమైనవి. అయినా
    ఈ రూపంలో గురజాడవారి జాడలు మిగిలాయి! సంతోషం!

    ReplyDelete