ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Monday, 24 December 2012

కమనీయ కథన శిల్పి పెద్దిభొట్ల




ఏ కోరసః కరుణ ఏవ’’ - అని తన కథల ద్వారా పఠితలలో ఆర్ద్రతను, భావానుభూతులను ఉద్దీపింపచేసే కథా‘్భవభూతి’- పెద్దిభొట్ల సుబ్బరామయ్య. ఆయన కథ చదివి ‘అనుకంప’ పొందని పాఠకుడుండడు. నిజానికి ఒక మంచి కథ యొక్క సంస్కార సంబంధమైన లక్ష్యం అదే కావచ్చునన్నది ఆయన గాఢ విశ్వాసం కూడాను. ఆయన కథల్లో అత్యధికం ఆద్యంత విషాదభరితాలే కావచ్చుగాక! ఆ కథల్లో సంఘటనలూ, సందర్భాలూ కంటే పాత్రలే ప్రధానంగా పాఠకులను పట్టుకు వెంటనంటి వుంటూంటాయి కూడాను. చదివే పాఠకుల గుండెల్ని పిండేయడమూ, కంట తడిపెట్టించడమూ తన శిల్ప రహస్యంగా ఆయన పని గట్టుకుని నిర్మించినవాడు కాదు.

ఆయన కథలేవీ నేలవిడిచి సాము చేయవు. ఉన్నదున్నట్టుగా కాకపోవచ్చు గానీ ఆయనే చెప్పుకున్నట్టు ఆయన కథల్లో చాలా మటుకు సొంత అనుభవాలే, పరిచిత వ్యక్తులే ప్రాతిపదికలుగా దీపిస్తూ వుంటాయి. ఏ అనుభవాన్నీ యథాతథంగా కథగా మార్చడం సాధ్యం కానట్లే స్వీయానుభవమే ప్రతి కథకీ పునాదిగా సమకూర్చడం సాధ్యం కాదు అంటారాయన.

పెద్దిభొట్ల వారి కథలన్నీ అధిక శాతం మధ్యతరగతి కథలే. మధ్యతరగతి జీవితాలను చిత్రించడంలో ఆయనది అసమాన ప్రతిభ. ఆయన కథలు జీవితంపట్ల గౌరవాన్నే కాక మహత్తరమైన బాధ్యతను కూడా నిర్వర్తించే అభ్యుదయ స్పృహ కలిగినవి. జీవితాన్ని వాస్తవిక సహజ కోణాల్లో దర్శించి, విమర్శనాత్మకంగా విశ్లేషించి, కథనాన్ని కమనీయంగా శిల్పీకరించే రచయిత ఆయన. తెలుగు కథానికను సుసంపన్నం చేసిన అగ్రగామి కథకుల్లో ఆయనదొక విశిష్టత.

అయిదు దశాబ్దాలకుపైగా కథారచన చేస్తున్న పెద్దిభొట్ల సుబ్బరామయ్య 1938 డిసెంబర్ 15న గుంటూరులో జన్మించారు. ఆయన రాసిన మొదటి కథ ‘చక్రనేమి’ 1959లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో బాపు వేసిన బొమ్మతో అచ్చయ్యింది. 'భారతి’లో ఆ రోజుల్లో దానిని పునః ప్రచురించడం ఓ విశేషం.

ఏ మానవుడికీ అన్నీ తెలియవు. కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలే తెలియవు అనేందుకు దర్పణంగా పెద్దిభొట్ల వారు రాసిన ‘ఇంగువ’ కథ వర్ణనలూ, హంగులూ ఆర్భాటాలూ లేక సాదాసీదాగా సాగిన కథే అయినా, ఒక అవిస్మరణీయ కథనం. ఇంతకూ ఆ కథలలోని ఓ పాత్రకు ఇంగువ అంటే ఏమిటో తెలుసుకోవాలన్నది తపన. అది ఏ పదార్థం? చెట్టునుంచి వస్తుందా? ఏదయినా రసాయినిక పదార్థమా? లేక ఒక రకం రాయివంటిదా? అదీగాక ఏదన్నా జంతువుకు సంబంధించిందా?’’ అన్న విషయం తెలుసుకోవాలన్న ఆరాటం. పదహారేళ్ళ ప్రాయం నుండీ ఆ సందేహం తనతోబాటు పెరుగుతూనే వచ్చింది. చివరకు ఆ సందేహం తీరకుండానే మరణిస్తాడు. ‘ఇంగువ’ కథ చదివాక పాఠకుడు కూడా ‘‘ఇంతకీ కథలో ఇంగువ అంటే ఏమిటో చెప్పనే లేదు’’ అనుకుంటే ‘‘అట్లా ఇంగువ అంటే ఏమిటో చెబితే ఆయన పెద్ద్భిట్ల సుబ్బరామయ్య ఎందుకవుతాడు? విశ్వనాథ అయి వుండేవాడు’’ అన్న కీ.శే. విశ్వనాథ పావనిశాస్ర్తి మాటే ప్రత్యుత్తరం మరి.

పెద్దిభొట్ల వారి కథల్లో బహుళ ప్రచారం పొందిన కథల్లో ‘నీళ్ళు’ ఒకటి. నీటి కరువు ప్రాంతం నుండి ఒక విద్యార్థి పుష్కలంగా నీరున్న తావుకి వెళ్ళాక విచిత్రంగా ప్రవర్తించి ఆ ప్రాంత ప్రజలను తన్మయ పరచిన కథ అది. నీరు మనిషిప్రవర్తనాతీరుకు నిర్ణాయక శక్తి కావడాన్ని ఆ కథల్లో అద్భుతంగా చిత్రించారు.

అలాగే ‘దగ్ధగీతం’ మరో గొప్ప కథ. ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలను శాసించే వికృతిని అప్పట్లోనే బలీయంగా రాసిన కథ. గొప్ప గాయని అయిన పంకజవల్లిని సేతురామన్ ప్రేమిస్తాడు. కానీ ఆమె రవిని పెళ్లాడుతుంది. రవి ఆమెను డబ్బు సంపాదించే యంత్రంగా మాత్రమే చూస్తూ తన సుఖాలకోసం మరో స్ర్తితో సంబంధం పెట్టుకుంటాడు. పంకజవల్లికి గొంతు క్యాన్సర్ రావడంతో కొంత డబ్బిచ్చి ఆమెను వదిలివెళ్లిపోతాడు. పంకజవల్లి మరణించగా సేతురామన్ దహనక్రియలు చేస్తాడు. సహజ ప్రేమ బంధాలను ధనసంబంధాలు ఎలా దోపిడీ చేస్తాడో తెలిపే కథ అది.
 
అలాగే ‘ముసురు’ కథానికలో పరాయి స్ర్తి ఇంట్లోవుంటే కామసంబంధాలు తప్ప ఆ స్ర్తి పురుషుల మధ్య మరో సంబంధం ఊహించలేని సమాజ కుసంస్కారాన్ని చిత్రించారు. పెద్దిభొట్ల వారి కథలలో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల వాతావరణం బాగా కనబడుతుంది. అలాగే పాత్రలకు ఆయన కథల్లో ఎంత విశిష్టత వుందో ప్రకృతికి ముఖ్యంగా మబ్బులు, ఎండ, వానలకు అంత ప్రాముఖ్యం వుంది. వర్షం అయినా ఎండ అయినా ఆ వాతావరణ పరిస్థితిని తన కథలకు భిత్తికగా వాడుకోవడంలో కథకుడి నైపుణ్యం ఎన్నదగింది. ‘‘బలిసిన ఏనుగులన్నీ ఒక చోట చేరినట్టు జలార్ద్రమైన మబ్బులన్నీ ఒకచోట చేరి కురుస్తాం కురుస్తామని గర్జిస్తున్నాయి’’ అని కథకు ప్రారంభంగా ఎత్తుకోవడం వంటి విన్నాణాలు చూస్తాము.
 
సుబ్బరామయ్యగారు ఇంతవరకూ రాసిన కథలు ఓ రెండు మూడు వందలు కావచ్చు. కానీ వాటిల్లో విస్మరించలేని వెంటాడే కథలు అనేకం. నీళ్ళు, చీకటి, ముసురు, నిప్పుకోడి, పూర్ణాహుతి, గాలి, అలజడి, సతీసావిత్రి, శుక్రవారం, దుర్దినం, దగ్థగీతం, కొళందవేలు బొమ్మ, చిలిపితనం, చింపిరి, చిలకహంస, పీట, తాతిగాడి చొక్క, కళ్ళజోడు, కోదండంగారి కల, కోరిక, ఏస్ రన్నర్, ఇలా ఎన్నో... క్రీడాంశ నేపథ్యంగా మంచి కథలు రాసిన ఘనత పెద్దిభొట్ల వారిదే. ప్రపంచ ఛాంపియన్‌గా ఖ్యాతిపొందిన గామా పహిల్వాన్ తన చివరి దినాల్లో ఆకలి భాధతో అస్తమించాడని తెలిసి రాసిన కథ ‘నిప్పుకోడి’! ‘ఏస్ రన్నర్’ కథ అలా క్రీడాకారుని దుర్భర స్థితిని చెప్పేదే.
 
ఏ యండమూరో ‘దవడ కండరం బిగుసుకుంది’ అని ప్రయోగించడం వేరు.
పెద్దిభొట్ల వారి కథల్లో ‘వేళ్ళు విరుచుకోవడం’ అనే చేష్ట పాత్ర పోషణకు ఒడుపుగా వాడుకున్న కథలు కొన్ని కనిపిస్తాయి. ఆ పాత్రల మానసిక స్థితి చిత్రణకు ఆ చేష్టను ఆయన ఎంత బాగా ఉపయుక్తం చేసిందీ కథాకథనంలో మనం గ్రహించగలుగుతాం.

పెద్దిభొట్ల కథలు పాఠకుల ముందు ఆవిష్కరించే ప్రపంచం అంతరంగాన్ని స్పృశించి, ఉర్రూతలూపి, ఆర్ద్రతతో సంచలింపచేసి, అనుభవ గాఢతను అందించి జీవితపు వాస్తవిక పార్శ్వాలనే విశేషీకరించి చూపేదిగా వుంటుంది. ఒక విషాద అనుభవ సంబంధితమై, ఆ అనుభవం పాత్రలు, ప్రతిమలు ప్రతీకల ద్వారా చిత్రింపచేస్తూ ‘అనుకంప’ రేకెత్తించేవిగా వుంటుంటాయి. మధ్యతరగతి బ్రతుకుల వివిధ పార్శ్వాల విషాధ ఛాయలన్నీ ఆయన కథల్లో తారట్లాడుతూ వారి బ్రతుకు ఖాళీలను సృజనాత్మకంగా పూరించుకునే చైతన్యోద్దీపకాలుగా భాసిస్తూంటాయి.

యన కథల గురించి నలుగురూ పలికిన మాటల్లోని యథార్థాలను పాఠకులే గ్రహించగలుగుతారు. జీవన బీభత్సాన్ని అసాధారణంగా చిత్రించిన కథాశిల్పిపెద్దిభొట్ల అని పురాణం సుబ్రహ్మణ్యశర్మ కొనియాడారు. జీవితంలోని విషాదాన్ని తప్ప ఉత్సవ వైభవం కేసి కన్నెత్తి చూడని కథారచయిత సుబ్బరామయ్య అని భమిడిపాటి జగన్నాథరావు ప్రశంసించారు. దళిత బ్రాహ్మణుల చరిత్రకారుడు అని ‘మో’ విశే్లషిస్తే, బాల్యం పారేసుకున్న భవభూతిభ్రాత అని పెద్దిభొట్లను కప్పగంతుల మల్లికార్జునరావు ప్రశంసిస్తారు.


‘‘కరుణ జీవలక్షణమన్నది నా నమ్మకం. అందులో కూడా గాఢమైన డైనమిజం వుందని నేను భావిస్తాను. అలాటి కథలు నేను చాలా కోపంతో రాస్తానని చెబితే బహుశా మీరు నమ్మరు. మన సమాజం మహా క్రూరమైనది. మతం, కులం, వర్గం, జెండర్- ఏది తీసుకుని చూసినా ఆ విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రోడ్డుమీద అడుగుపెట్టిన దగ్గర్నుంచీ అడుగడుగునా మన సామాజిక జీవనంలోని క్రూరత్వం సెవంటీ ఎంఎంలో కనిపిస్తూనే వుంటుంది. మన మానవ సంబంధాలు బహుబలహీనమైనవి. వాటికి సొంత రంగూ రుచీ వాసనా వుండడం అరుదు. ఇలాంటి జీవితాన్ని ద్వేషించకుండా వుండేవాళ్ల మానసిక ఆరోగ్యం మీద నాకు నమ్మకం లేదు. రచయితగా ఇలాంటి పరిస్థితికి- అసహాయతకి స్పందించకుండా ఎలా వుండగలమో ఊహాతీతం. అది ఆగ్రహం కాక మరోలా ఎలా వుండగలదు? అయితే కరుణ రసాన్ని వాహికగా చేసుకుని నేను నా ఆగ్రహాన్ని ప్రకటిస్తాను. అది వాచ్యంగా వుండకపోవడం దాని బలహీనత కాదు బలమే అనుకుంటాను. అలాంటి కథలవల్ల పాఠకుడికి ఒక్కోసారి శోకం ముప్పిరిగొనే అవకాశం ముమ్మాటికీ వుంది. కానీ అది అతగాడిని నిష్క్రియాపరత్వం వైపో, మెట్టవేదాంతం వైపో తీసుకెళ్తుందని మాత్రం నేను అనుకోవడంలేదు’’ అంటారాయన.

భావతీవ్రతతో కదలిపోయినప్పుడు మాత్రమే కథలు రాసే పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారు అయిదు దశాబ్దాలకుపైగా తెలుగు కథకు సమకూర్చిన వైభవ ప్రాభవాలకు గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం తెలుగు సాహిత్య ప్రపంచానికి ముదావహమైన విషయం. డెబ్భై అయిదేళ్ల ఈ అవిశ్రాంత సాహిత్య పథికుడు తెలుగువారు గర్వించదగిన ఉత్తమ కథారచయిత. జీవితంలోని కశ్మలాన్నీ, కల్మషాన్నీ కడుక్కుని, అమానవీయ సాంఘికాంశాలను విదుల్చుకుని, జీవితాన్ని అర్థం చేసుకుని జీవనం సాగించడానికీ, జీవితంమీద విమర్శ పెడుతూనే జీవితం మీద ఆశ కలిగించుకోవడానికీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు దారి దీపాలు.