ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Thursday 9 June 2011

‘బాపు’రే! ఎంత ఆనందమో!!






పదేళ్ల క్రితం అనుకుంటాను... అంటే 2001లో, కొన్ని పత్రికల్లో ఓ వార్త వచ్చింది. అదేమిటంటే- బాపు బొమ్మలు శాశ్వతంగా పెట్టడంకోసం కోటి రూపాయలతో ఓ మ్యూజియం కడుతున్నారనీ, శిల్పారామం ఎదురుగా ఐదెకరాల స్థలంలో ‘మ్యూజియం’ నిర్మాణం జరుగుతోందనీ, అప్పటి హుడా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి లక్ష్మీపార్థసారధి భాస్కర్, మరో ఐఎఎస్ అధికారిణి రాణికుముదిని దీనికి సమకట్టారనీ, ఆ మ్యూజియంలో బాపుగారి ఒరిజినల్ డ్రాయింగ్స్, లైన్ డ్రాయింగ్స్, కలర్ చిత్రాలూ, కార్టూనులు మాత్రమేకాక, ఆయన చలనచిత్రాలు సి.డి.లు అవికూడా భద్రపరచున్నారనీ ఆ వార్త.

అది విని- బాపు బొమ్మలు ఇష్టపడే తెలుగు వారందరికీ బోలెడు ఆనందం వేసింది. తెలుగుతనానికి ‘బాపుబొమ్మ’, తెలుగు అక్షరానికి ‘బాపు లిపి’ సాటిలేని మేటి నిదర్శనాలు! తెలుగువాడిగా పుట్టిన బాపుగారి బొమ్మలను ఒక ‘శాశ్వత మ్యూజియం’ అని విని, ఆయనను గౌరవించుకోవడానికే కాదు, మన తెలుగుతనాన్ని మనం నిలుపుకోవడానికీ ఇది జరగవలసిన సత్కార్యం అనీ, జరగబోతోందనీ ఆనందపడ్డాం. కానీ మరి ఏమయిందో?-

‘‘సృష్టిలో ‘తీయనిది’ స్నేహమేనోయ్’’ అన్నదానికి ‘సాక్షి’గా, పైగా- మేం ‘తీసాం’ అంటూ, ‘స్నేహం’ చిత్రం కూడా తీసి చూపిన అపురూపమై బాపు ముళ్లపూడి. వారిద్దరినీ ఒకటిగా తప్ప రెండుగా చూడడం కుదరనిపని. కానీ విధికి అలాంటి వెధవ పనులు చేయడం ‘బలీయం’ అయిన ఇష్టం కాబట్టి మృత్యువు పేరున ముళ్లపూడి వారిని భౌతికంగా బాపునుండి విడదీసి తెలుగు వారందరికీ దూరం చేసింది. ముళ్లపూడి రాత- బాపుగీత! అదీ తెలుగుతనానికి జోత!- కానీ విధిరాతను తప్పించలేం కదా-

ముళ్లపూడి అస్తమయం అందరికన్నా ఎక్కువ లోటు బాపుగారికే.

ననుగోడలేని చిత్తరువుని చేసి
వెళ్లిపోయిన నా వెంకట్రావు
కోటి కోట్ల జ్ఞాపకాలకు
సభక్తికంగా

అంటూ ముళ్లపూడి గురించి స్మరిస్తూ తన- బొమ్మల కొలువు ప్రత్యేక సంచికనే కాదు, తన హృదయాన్నే
అంకితం చేస్తూ సాగుతున్నారు బాపు ఇప్పుడు.

‘గోడలేని చిత్తరువు’ అయిన బాపుకు, ఆయన తీరని ‘గోడు’ను తీర్చే అవకాశం ఎలాగూ లేదని, ‘మ్యూజియం’ సంగతి మరిచారేమోగానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాదాపూర్ శిల్పారామం దగ్గర్లోనే ఉన్న స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జూన్ 4, 5, 6 తేదీలలో ఆ గ్యాలరీ గోడలను బాపు బొమ్మలు తగిలించడానికి సౌజన్యమిచ్చి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి సౌజన్యంతో, మూడు రోజులపాటు ‘ముఖీమీడియా’ బాపు ఒరిజినల్ బొమ్మలను, ముఖాముఖి చూసే అవకాశాన్ని తీర్చిదిద్దింది. ఎన్నాళ్లకెన్నాళ్లకో బాపు ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పరచింది.

జూన్ నాల్గవతేదీ శనివారం ప్రారంభోత్సవానికి ముందే ఓ గంటకుపైగా బాపుగారు కార్టూనిస్టులకూ, చిత్రకారులకూ
తనను కలుసుకునే అవకాశం కల్పించారు! అందుకోసం మద్రాసునుండి ,ఇంకా దూర దూర ప్రాంతాలనుండీ ఆయన (ఏకలవ్య) శిష్య ప్రశిష్యులు ఎందరెందరో తరలివచ్చారు!!

 ప్రొద్దుటూరు నుండి ఒక అభిమాని రెండురోజుల ముందు తన ‘టూవీలర్’ బండెక్కి వచ్చి, ఆయనకు తాను వేసిన ఆయన బొమ్మను ప్రేమ్ కట్టించి ఇచ్చి మురిసిపోవడమే కాదు, ప్రొద్దుటూరులో తను తలపెట్టిన ఆర్ట్‌గ్యాలరీ- బాపుగారు ఏడాది తర్వాత గానీ రావడానికి కుదరదన్నా, అప్పటివరకు కూడా వేచి చూస్తానుగానీ, ఆయన చేతులు మీదుగానే ఆవిష్కరణ జరగాలని, తన ప్రగాఢ వాంఛను సమావేశంలో ప్రకటించాడు. బాపు ఎందరి గుండెల్లో ఎలా కొలువున్నారో చెప్పడానికి ఇదో వాచవి.

తొలుత జరిగిన కార్టూనిస్టులు, చిత్రాకారులు బాపుతో సమావేశమైన సందర్భంలోనే శ్రీ తనికెళ్ల భరణి, స్వాతి బలరాంగారు పంపిన లక్ష రూపాయల పర్స్‌ను, డబ్బు మొత్తం బయటకు తీసి చూపి మరీ, సభక్తికంగా బాపుగారికి అందించారు! కథకులు, సినీ దర్శకులు వంశీ సమక్షంలో మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మూడురోజుల బాపు బొమ్మల కొలువు సందర్భంగా ‘ముఖీ మీడియా’ శ్రీ శివలెంక పావనీ ప్రసాద్, బ్నిం, గంధం దుర్గాప్రసాద్, అన్వర్‌ల సహకారంతో వెలువరించిన అపురూప ప్రత్యేక సంచికను కొలువు చూడవచ్చిన వారెందరో కొనుక్కుని అందులో బాపుగారి సంతకం తీసుకుని మురిసిపోయారు! చెరగని చిరునవ్వుతో ఎక్కడా అలసటలేక బాపుగారు అందరికీ తన ఆటోగ్రాఫ్ అలా ఆ పూట, గంటల తరబడి ఇస్తూనే వచ్చారు. కార్టూనిస్టులందరితో గ్రూపు ఫోటో దిగారు. ఆ అలసటలోనే సేద తీరారు!

‘సొగసు చూడ తరమా!’ అని బాపు బొమ్మల వీక్షణానందాన్ని అక్షరాల్లో పట్టివ్వడం కుదరనిపని! ఒక్కొక్క బొమ్మ దగ్గరా నిలబడి ఎంతసేపయినా గడిపేయవచ్చు. ‘మ్యూజియం’ అంటే అదేదో ‘పురాతన వస్తువులు భద్రపరిచే చోటు’ అనుకునేట్లయితే. బాపు బొమ్మకు నిరంతర సజీవలక్షణం ఉందాయెమరి!!! 1970 ప్రాంతాల్లో ఆయన వేసిన బొమ్మలు చూసి ఓ తరం వీక్షకులు, తమ జీవితపు ఆల్బమ్‌లుకూడా జ్ఞాపకాల పుటలతో తిరగవేసుకున్నారు.

ఆయన ‘కార్టూన్లు’ ఎప్పుడో వేసినవి అయినా, ఇప్పటికీ అంత తాజాగా సరికొత్త నవ్వులను పూయిస్తూనే వున్నాయి. గ్యాలరీలో అలా రాలిన నవ్వుల రవ్వలెనె్నన్నో!! దాదాపు ఆరువందలకు పైగా బాపు బొమ్మలు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. అన్నీ ఒరిజినల్సే! చేయి తిరిగిందనుకుంటున్న చిత్రకారులుకూడా ఆయన బొమ్మల్లో, ఒక్క దిద్దుబాటు రేఖగానీ, వైట్ పెయింట్ గుర్తుగానీ లేకపోవడం, అంత పర్‌ఫెక్ట్‌గా ఎలా గీశారా అని నివ్వెరపోతూ సంభ్రమంగా చూడడం జరిగింది.

తొలినాటి ప్రారంభోత్సవ సభలో అక్కినేని నాగేశ్వరరావుగారు ‘‘బాపుగారు తన రేఖలద్వారా సతతమూ నవరసాల పోషించగల అసలు సిసలు కథానాయకుడు. ఆయనే అసలు హీరో’’ అన్నారు. నటుడు బాలకృష్ణ ‘శ్రీరామ రాజ్యం‘ చిత్రంలో ఆయన దర్శకత్వంలో చేస్తున్న భాగ్యానికి మురుస్తూ ‘‘బాపు బొమ్మలేని తెలుగు ఇల్లు లేదంటే అతిశయోక్తి కాద’’న్నారు. శ్రీ వరప్రసాద్ రెడ్డి, మోహన్‌కందా మొదలైన ప్రముఖులు వేదికపై ఆసీనులై ఉండగా, రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్‌వి. రమణమూర్తి, సాంస్కృతిక వ్యవహారాలశాఖ డైరెక్టర్ జె.ఎల్.కాంతారావు ప్రభుత్వం పక్షాన ‘రేఖా చిత్రకళా చక్రవర్తి’ అనే బిరుదును అక్కినేనిచేతుల మీదుగా, అందరూ గౌరవ సూచకంగా నిలబడి కరతాళధ్వనులు చేస్తుండగా ‘బాపు’ గారికి ప్రదానం చేశారు. టి.సుబ్బరామిరెడ్డిగారు పంపిన నగదు పారితోషికాన్ని బాపుగారికిచ్చారు.

ఎన్ని కార్టూన్లు!
ఎన్ని క్యారికేచ్చర్లు!!
ఎన్ని రేఖా చిత్రాలు!!!
ఎన్ని కలర్ పెయింటింగ్స్!!!!
ఎంత చిత్రకళా వైవిధ్యం
ఆర్ట్ గ్యాలరీ గోడలు - బాపు చిత్తరువులను ధరించి పొంగిపోగా, విచ్చేసిన ప్రేక్షకులు ఆ గోడలకు తగిలించిన బొమ్మలను వీక్షిస్తూ, రసానంద పరవశులవుతూ, అమందానంద కందళిత హృదయారవిందుయ్యారు. ఆ బొమ్మలు చూస్తూ ఆ నవ్వులనూ, ఆ కథలనూ, ఆ రసానందాలనూ, ఆ భక్తి భావాలనూ, పునః అనుభూతి చెందారు. మామూలు మనుషులు, పరిసరాలూ, ప్రకృతీ మాత్రమేకాదు- మనసులూ, ఆత్మలుకూడా ఉన్న బాపు బొమ్మల్లో, అందుకే దేవతలూ, దేవుళ్ళు కూడా తమను తాము తీర్చిదిద్దుకుని, ప్రత్యక్ష దర్శనమిచ్చారు!

మూడు రోజులపాటు ‘కళాభూమి’ మాదాపూర్ స్టేట్ గ్యాలరీలోనే స్థిరపడిందా! అన్నట్లనిపించింది. ఆ బొమ్మలు అక్కడే. ఎప్పటికీ, శాశ్వతంగా, తరతరాలు చూసేందుకు ‘అలాగే ఉంచేస్తే ఎంత బాగుణ్ణో కదా!’ అనీ అనిపించింది చాలామందికి.

అలరిస్తూ బాపుగీసిన ప్రతి గీత మాట్లాడుతుంది. ఏ సభనైనా అలంకరిస్తుంది. కానీ ఆయనే ఏ సభలోనూ మాట్లాడరు. ‘అందరికీ నమస్కారం’ అదొక్కటే ఆయన ప్రతిస్పందనాపదం. ‘నా నృషిః కారుతే కావ్యం’ అన్నట్లు. ‘గీత’ తోనే సకల మానవ జీవన సారం చూపిస్తూ పలకిస్తూ పరవశింపచేస్తూ తాను మాత్రం మాట్లాడని మౌనిలా అంత సంయమనంతో ఉండడం ఆయనకే సాధ్యమైంది! కృష్ణుడి మీదయినా కార్టూన్లు వేసారేమోగానీ, రాముడిని సరదాకికూడా ఒక్క వ్యంగ్యరేఖతో చూడ(లే)ని, చూప(లే)ని ‘రామభక్తి సామ్రాజ్యం’ బాపుది! ఆయనను కట్టుకున్న తెలుగుతనపు బొమ్మ నిజంగా భాగ్యవతి!!

బాపు బొమ్మల కొలువుకు - రసికాంధ్ర జనుల ఎడద, ఎప్పుడూ శాశ్వత స్థలం వుండి వుంటుంది. కానీ ‘మనసుకుతోచీ కనులకందని’ స్థితినుంచి ఎదిగివచ్చి, శాశ్వతంగా తరతరాల వీక్షకులకు ఒక నిధిగా పెన్నిధిగా, బాపు బొమ్మలను అందించవలసిన బాధ్యత పాలకులదే!;పరిపాలయమాం...’ అంటూ వేడుకోవాల్సిన పరిస్థితి రాకుండానే ‘చేదుకోవాల్సిన’ బాధ్యత, మంచి పనులతో కళాభిమానులను ‘చేరుకోవాల్సిన’ కర్తవ్యం ప్రభుత్వానిదే. మన ‘బాపు’ బొమ్మలు అనుక్షణం కొలువుతీరి ఉండే ప్రాంగణం ఇకనైనా ప్రాప్తిస్తే ఎంత బాగుంటుంది!

బాపు చిరంజీవి.
బాపు బొమ్మ చిరంజీవి




(ఆంధ్రభూమి (దినపత్రిక) 9.6.2011 గురువారం 'కళాభూమి ' లో.)




3 comments:

  1. it is an perfect example of a integrated reporting.congratulations though you dont need them :)

    ReplyDelete
  2. Thank you Sudhama Garu!
    As you mentioned in the beginning of the paragraph -Bapu Art museum at Madhapur, I have been the architect since Bapugaru gave me the responsibility to design the gallery. Nutan Prasad garu and I submitted the architectural drawings along with a model with the approval of Bapugaru to the HUDA.

    Later government officials moved the museum of 5 acres land from Madhapur to a round shaped hall in the NTR gardens at Tankbund due to political reasons. I did again design interiors for the same but due to change of governments and bureaucracy, it never took a shape.

    Finally I decided to go on my own to setup a permanent gallery with the help of like minded people.

    ReplyDelete
  3. ఎన్నిసార్లు చదివినా తనివితీరదు. ఆ నాటి సభకు రాలేకపోయిన నాకు
    మీరు చెప్పిన విశేషాలు చదివాక నేనెంత కోల్పోయానో అని బాధ కలిగింది.
    --యమ్వీ అప్పారావు (సురేఖ)

    ReplyDelete