ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Showing posts with label సాగుతున్నయాత్ర. Show all posts
Showing posts with label సాగుతున్నయాత్ర. Show all posts

Thursday, 2 August 2012

తెలుగు లో ఇంగ్లీష్




తెలుగులో ఇంగ్లీష్ పదాలు ఎక్కువైపోతున్నాయని,కుర్రవాళ్ళు ఆంగ్ల పదాలు లేకుండా తెలుగు మాట్లాడడం అరుదై పోతోందని ఇవాళ గగ్గోలు పెడుతున్నాం. 


తెలుగు లో ఇంగ్లీష్ సంకరం అవడం గురించి 1951 లోనే ఘంటా పేరుతో ఒక వ్యాసం నాటి ప్రముఖ వారపత్రిక 'ఆనందవాణి ' లో మార్చి 25 వ తేదీ సంచికలో ప్రచురింపబడింది. ఆ వ్యాసం చదవండి.నాటికీ నేటీకీ మన వైఖరిలో గుణాత్మకమైన మార్పేమీ లేదని తేటతెల్లం అవుతూనే వుంది. 







Thursday, 7 June 2012

చదివే అలవాటులో..








ప్రముఖ కార్టూనిస్ట్,రచయిత
శ్రీ 'రాంపా'రాసిన
'చదివే అలవాటులో'అనే పుస్తక ఆవిష్కరణ

ఈమధ్యనే
హైదరాబాద్ లోని దోమల్ గూడా లో గల
ఎమెస్కో వారి హాల్ లో జరిగింది.


ఆ సభలో నేనూ పాల్గొన్నాను.


నవ్య వారపత్రికలో వచ్చిన
కార్యక్రమ నివేదిక ఇది.

Thursday, 5 April 2012

శంకర్ గారు వేసిన నా బొమ్మ





శ్రీ సత్తిరాజు శంకర నారాయణ

ఈ పేరు ఎక్కడైనా విన్నట్టుందా!

ప్రముఖ చిత్రకారులు బాపు గారి అసలు పేరు అనుకుంటున్నారా!.
కాదండి బాబూ!
బాపు గారి అసలు పేరు శ్రీ సత్తిరాజు లక్ష్మీ నారాయణ.

మరి ఈ శంకరనారాయణ ఎవరంటే ,స్వయానా బాపు గారి తమ్ములే!



శంకర నారాయణ గారు కూడా స్వయంగా చిత్రకారులు.
పెన్సిల్ తోనూ,చారోకోల్ తోనూ అనేకమంది ప్రముఖుల క్యారికేచర్ లు చిత్రించారు.దాదాపు 1500 కు పైగా అటువంటి అద్భుతమైన బొమ్మలు వేసి ఆయన ఇటీవలే ఇండీయన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందారుకూడాను.


1936 లో జన్మించిన శంకరనారాయణ గారు ఆకాశవాణి మద్రాస్ కేంద్రంలో స్టేషన్ డైరక్టర్ గా ఉన్నత పదవిలో పనిచేసి ,1995 లో రిటైర్ అయ్యారు.


అప్పటినుంచీ ఇంకా బోలెడు బొమ్మలు వేస్తున్నారు.
మైసూర్ లోనూ,హైదరాబాద్ లోనూ కూడా తమ బొమ్మల ప్రదర్శనలు ఏర్పాటు చేసి ప్రశంసలందుకున్నారు.




ఇవాళ (5.4.2012)  పొద్దున్న నా సెల్ మ్రోగింది.
స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ ఎవరిదో తెలియదు.
ఫోన్ ఆన్సర్ చేయడానికి ఎత్తుదునుకదా.. 'నేను శంకర్ నండీ " అంటూ ఆయనదే గొంతు.


ముళ్ళపూడి వారి అబ్బాయి వర ముళ్ళపూడి.
వాళ్ళింటి నుండి మాట్లాడుతూ శంకర్ గారు'మా అల్లుడి ఇంటినుండి మాట్లాడుతున్నాను 'అంటూ మాట్లాడారు.



ఇంతకీ నేను ఆనందంతో పొంగిపోయే విషయం నా క్యారికేచర్ వేశానని, నా ఈ మెయిల్ అడ్రస్ అడిగి ,దానికి వెంటనే పంపించారు.


ఆహా ! ఏమి నా భాగ్యం అనుకున్నాను. నా క్యారికేచర్ వేయాలని ఆయనకు ఎందుకు అనిపించిందో! అది కేవలం నా అదృష్టం అంతే!.




ఆయన వేసిన నా క్యారికేచర్ ఇది





ఆయనకు నా కృతజ్ఞతలు ప్రకటించడం తప్ప
ఆయన సహృదయతకూ,ఔదార్యానికీ నేనేమివ్వగలవాడిని.



శ్రీ శంకరనారాయణ గారు సదా ఆయురారోగ్య ఐశ్వర్యాలతొ విరాజిల్లాలని మనసా ఆకాంక్ష.

-సుధామ

Monday, 19 March 2012

కొత్త పండుగ


 
 
వర్షవర్షానికీ తను సంతరించుకునే కొంగ్రొత్తలు-
మన శుభ జీవన భవనపు ఆశల పునాదులు.
తన కదలికనీ, ఆ కదలిక మనపై ముద్రించే
అనుభవ చిత్రాలనీ తిలకించి స్పందిస్తూంటాం.
అకృత్రిమ సౌందర్యరాశి,
ఋతుక్రమాన ఆసాదిత యౌవ్వన కన్యక - ఉగాది.
ఇక నందన ఉగాది.
ఉగాది -
మన జీవితమంతా ఆధారపడి వున్న కాలానికి సంబంధించింది.
మృత్యు శిశిరాలు వెళ్లిపోతూ, జనన వసంతాలు వస్తూంటాయి.
వసంతం మావి చిగురునూ, కోయిల పాటనూ తెస్తుంది.
అంటే - ఆశనూ, ఆనందాన్నీ ఇస్తుంది.
కొత్త సంవత్సరారంభాన్ని ‘ఉగాది’ పండుగ రూపంలో అందుకుంటాం.
కాలం - నిముషాలు, గంటలు, తేదీలు, వారాలు, పక్షాలు, మాసాలు, ఆయనాలు, సంవత్సరాలు, యుగాలుగా కొలుచుకుంటున్నా, కాలాన్ని మనం భగవత్స్వరూపంగా సంభావించుకుంటాం!
గిర్రున తిరిగే కాలం వల్ల చిత్రవిచిత్ర రీతులు పొందే ప్రకృతిని అర్థం చేసుకుంటూ, తదనుగుణంగా మన జీవితాలను తీర్చిదిద్దుకునే ఇహపర సాధనోత్సాహమే ఉగాది. ఉగాది పండుగలోని పరమార్థం అదే!
ప్రతి సంవత్సరం - చైత్ర శుద్ధ పాడ్యమితో మొదలవుతుందిది. మన తెలుగు సంప్రదాయంలో, ఏటా ఈ ఆరంభ దినాన్ని, మాసాలలో మొదటిదైన చైత్రమాసం తొలి రోజుని, ఋతువుల్లో మొదటిదయిన వసంత ఋతు ప్రారంభ దినాన్ని, తిథులలో మొదటిదైన పాడ్యమినాడు, పక్షాలలో మొదటిదైన శుక్ల పక్షం నాడు వచ్చే మొదటి దినాన్ని, - ‘ఉగాది’ అంటారు. బ్రహ్మ తన సృష్టిని ఆరంభించిన రోజు కనుక ‘యుగాది’గా పేర్కొంటారు.
ఉగాది రోజు పంచాంగ శ్రవణమే ప్రథమగణ్యంగా గుర్తించాలి! కాలగణనంలో పంచాంగ విధానమే సమగ్రం, శాస్త్రీయం కనుక ఆది‘పర్వం’ ఉగాది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు కలిసి ‘పంచాంగం’ అయింది. ఈ అయిదు అంశాల బలాబలాలను ఋషులు నిర్ణయించి శాస్త్రాలు రాశారు. పంచాంగం చేసేప్పుడు పంచాంగ కర్తలు సృష్ట్యాదిగా గతించిన దినములు తీసుకుని గణన చేస్తారు. అంటే సృష్టి ప్రారంభమైన తొలి రోజు నుంచీ కాలాన్ని లెక్కగడుతూంటారన్న మాట.
అమావాస్య నాడు సూర్యునితో కలిసి వుండే చంద్రుడు - ప్రతి దినం కొంచెం కొంచెంగా తూర్పువైపుగా దూరమౌతుంటాడు. మొదటి దినం దూరానికి ‘పాడ్యమి’ అనీ, రెండవ దూరం విదియ, తృతీయ తదియ, నాలుగోది చవితి ఇలా.. సూర్య చంద్రుల దూరానికీ ‘తిథు’లని పేరు. కృష్ణపక్షంలో దూరాల తగ్గుదల, శుక్లపక్షంలో దూరాల పెంపుదల జరుగుతుంది. ఇక రెండోదిగా పంచాంగంలో గుర్తించేది ‘వారం’. ‘ఉదయాదుదయం వారం’ అంటే ఇవాళ సూర్యోదయం మొదలు మరునాడు సూర్యోదయం వరకూ ‘వారం’ మాత్రం మారదు.
‘తిథి’ ఇరవై నాలుగ్గంటల్లో ఎపుడయినా మారిపోతూంటుంది. ఒక్కొక్క తిథి మర్నాడు కూడా కొంతసేపు ఉంటుంది. ‘తిథి’ చంద్రగమనం వల్ల ఏర్పడేది కావడమే దానికి కారణం. తర్వాతది ‘నక్షత్రం’. ఇవి 27. ఒక్కొక్క నక్షత్రం సరళ రేఖలో చంద్రుడు ఎంతసేపుంటాడు అన్న దానినిబట్టి ఆ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవత వుంటాడు. ఆ దేవత స్వభావాన్ని అనుసరించి ఆ నక్షత్ర ఫలితాలను నిర్ణయిస్తారు. అశ్వనీ నక్షత్రానికి అధిపతులు అశ్వనీ దేవతలు కనుక చంద్రుడు ఆ నక్షత్రంతో సరళ రేఖలో వున్నప్పుడు చికిత్సకు మంచిదన్న మాట! ‘చంద్రుడు’ - మనకు దగ్గరగా వుండే గ్రహం. పైగా స్ఫటికం దగ్గర ఏ రంగు పువ్వు పెడితే స్ఫటికం ఆ రంగులో కనపడేటట్లుగా - ఏ నక్షత్రం దగ్గర సరళ రేఖలో వుంటే ఆ నక్షత్ర గుణ స్వభావాలతో చంద్రుడు ప్రభావం వేస్తాడన్నమాట! ఈ నందన ఉగాది నాటి ఉత్తరాభాద్ర నక్షత్రం - ఉత్తర, ఉత్తరాషాఢ, వలె అన్ని శుభాలకూ మంచిది. చంద్రుడు శుద్ధ సప్తమి నుంచి కృష్ణపక్ష సప్తమి వరకు పూర్ణ బలవంతుడు కనుక ఆ మధ్యకాలంలోని ముహూర్తాలకు బలం ఎక్కువ. నవగ్రహాలన్నీ కూడా వాటి సంచారాన్ని అనుసరించి, ఒక్కొక్క కోణంలో వుంటాయి భూమికి. ఆయా గ్రహాల ఆయా కోణాలను బట్టి వాటి ప్రభావాలు భూమి మీద వేర్వేరుగా ఉంటాయి. అందుకే కార్యసాధనకు ‘గ్రహబలం’ తోడు కావాలనేది! పంచాంగంలో ‘యోగం’ కూడా 27 రకాలు. అందులోనూ మంచీ చెడూ ఉంది. ఇక ‘కరణం’గా చెప్పుకునేది తిథిలోని అర్ధ్భాగం. ఇవి పదకొండు. వీటిల్లోనూ కొన్ని మంచివి కొన్ని చెడ్డవీ అంటూ వున్నాయి. ఇలా కాల వివరణ పంచాంగబద్ధమై, పంచాంగ మగ్నమై వుంది.
‘తిథి’ సంపదను, ‘వారం’ ఆయుష్షును ఇస్తుంది. ‘నక్షత్రం’ పాపాలను పోగొడుతుంది. ‘యోగం’ రోగ నివారణ చేస్తుంది. ‘కరణం’ కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాలం తెలిసి, పంచాంగాన్ని అనుసరించే నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించేవారు - దేవతానుగ్రహం పొందుతారని పంచాంగ ఫలం.
తిథేశ్చశ్రీయామాప్నోతి వారాదాయుష్యవర్ధనమ్
నక్షత్రాదర్హతే పాపం యోగాద్రోగ నివారణమ్
కరణాత్కార్య సిద్ధిస్తు పంచాంగ ఫలముత్తమమ్
కాలవిత్కర్మకృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్
అంతేకాదు! ‘పంచాంగం’ సిరిసంపదలు కలిగిస్తుంది. శత్రువులను నశింపజేస్తుంది. చెడు స్వప్న దోషాలను పోగొడుతుంది. గంగాస్నానం చేసిన పుణ్యాన్ని, గోదానంతో సరితూగే పుణ్యాన్ని కూడా ఇవ్వగలదు. ఆయుష్షును వృద్ధి చేస్తుంది. మంచి శుభాలనూ, సంతానాది భోగభాగ్యాలను కలిగిస్తుంది. అనేక పనులను సులభసాధ్యాలుగా చేస్తుంది. కాబట్టే ‘పంచాంగ శ్రవణానికి’ ఎంతో ప్రాధాన్యం ఉంది.
‘శ్రీ కల్యాణ గుణావహం
రిపుహరం దుస్స్వప్న దోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం
గోదాన తుల్యం నృణామ్
ఆయుర్వృద్ధి దముత్తమం శుభకరం
సంతాన సంపత్ప్రదమ్
నానాకర్మ సుసాధనం సముచితం
పంచాంగమాకర్ణ్యతామ్’ - అని చెప్పబడింది.
‘పర్వం’ అంటే పండుగ. పండుగ చేసుకోవాలి అంటే ప్రకృతి, పరిసరాలు అనుకూలించాలి. చైత్ర శుద్ధ పాడ్యమి - అంటే ఉగాది రోజు నుంచి, వైశాఖ బహుళ అమావాస్య వరకూ రెండు నెలల కాలం వసంత ఋతువు. ‘వసంతం’ రాగానే మ్రోడులు కూడా చిగురిస్తాయి. చెట్లన్నీ పూలతో శోభిల్లుతూంటాయి. మామిడి చెట్లకు కాయలు గుత్తులు గుత్తులుగా వ్రేలాడుతాయి. రంగులతో, పరీమళాలతో ప్రకృతి పచ్చదనంతో శోభాయమానంగా, రసానందమయంగా ఉంటుంది.
చిగురు చిగురున రాగశీకరము లొలికించి
ఆకునాకున మరకతాకృతి పలికించి
పూవు పూవున మధువు పుకిలింత లొనరించి
వచ్చె కుసుమాస్త్ర భాస్వంతము వసంతమ్ము
అంటారు ‘ఋతు చక్రం’ కవి సినారె. మావి చివురులు తిని కోకిలలు మనోహరంగా కూసే కాలం ఇదే. వసంతాన్ని వర్ణించని కవులెవరు? రమణీయ కాల గణనంలో - వసంతానికే అగ్ర తాంబూలం. ఈ కాలంలో పుష్పాలలో ‘మధువు’ అంటే - తేనె ఎక్కువగా ఉంటుంది కనుకనే, ‘మధుమాసం’ అనీ పేర్కొంటారు.
పుంస్కోకిలశ్చూత రసాసవేనమత్తః
ప్రియాం చుంబతి రాగ హృష్టః
కూజద్ద్విఫో స్యయ మంబుజస్థః
ప్రియం ప్రియాయాః ప్రకరోతిచాటు
అంటూ మహాకవి కాళిదాసు తన ఋతు సంహార కావ్యంలో వసంత శోభను వర్ణించాడు. ఆమ్రరసమనే మద్యం తాగి, మదించిన మగ కోకిల, అనురాగంతో తన ప్రేయసిని ముద్దాడుతోంది! కమలం మీద వాలి ఝంకారం చేస్తున్న భ్రమరం కూడా తన ప్రియురాలిపైన ఎంతో గొప్పగా ప్రేమ ప్రకటిస్తుంది. ‘వసతి సుఖం యధాతథా స్మిన్నితి వసంతః’ అంటూ - జనులు సుఖంగా వుండే కాలం కనుక, వసంత కాలమనే పేరు వచ్చిందని చెప్పబడింది.
కామధేనువుకు ‘సురభి’ అనే పేరుంది. కోరిన కోర్కెలు తీర్చే కాలంగా మధుమాసానికి అందుకే ‘సురభి’ అనే పేరు కూడా వ్యవహారంలో ఉంది. దశరథుడు పుత్రకామేష్టి వసంత కాలంలోనే చేసి అభీష్ట ఫలసిద్ధి నొందాడని వాల్మీకి -రామాయణంలో రాశాడు. అందువల్ల ఉగాదినాడు ప్రారంభించిన పనిగానీ, అసలు వసంత కాలంలో మొదలెట్టిన పనులు ఏవయినా గానీ - ఆటంకాలు లేక పూర్తవుతాయనేది విశ్వాసం.
సీతారామ కల్యాణం కూడా మధుమాసంలోనే జరిగింది. చైత్ర వైశాఖాలు - వసంత ఋతువు. చిత్తానక్షత్రయుక్త పూర్ణిమ, విశాఖా నక్షత్రయుక్త పూర్ణిమలతో కూడిన రెండు నెలలూ మధుమాసాలే! వైశాఖమే ‘మాధవ’ అనే శబ్దంతో చెబుతారు. శ్రీకృష్ణుడు కూడా మాధవుడే. ‘కృష్ణ’ అనే పదంలో ‘కృష్’ ధాతువుకు అర్థం సత్త. ‘ణ’ అన్న దానికి అర్థం నిర్వృతి. అంటే ఆనందం. ఈ రెంటి కలయిక ‘కృష్ణ’ అంటే సదానందమన్నమాట!
‘విశాఖ’ నక్షత్రానికి ‘రాధా’ అనే పేరుంది. వైశాఖ మాసాన్ని ‘రాధః’ అని కూడా అంటారు. రాధాకృష్ణుల తత్వానికి సంకేత కాలం కూడా ఇదే. రాధాకృష్ణులనగానే - వారి మధ్యగల ప్రేమానురాగాలు, రాసలీలలు గుర్తుకొస్తాయి. వేదం ‘ఆనందోబ్రహ్మేతివ్య జానాత్’ అంటూ సదానందమే పరబ్రహ్మమంది. ఆ పరబ్రహ్మయే ‘కృష్ణ’. ‘కర్షతీతి కృష్ణః’ అని - ఆకర్షించేవాడు కృష్ణుడు. జీవాత్మ అయిన ‘రాధ’, పరమాత్మ అయిన ‘కృష్ణ’లో సంగమించడమే అమందానంద సదానంద బ్రహ్మానంద యోగం! సదానంద రూపమైన పరిపూర్ణ రూపాన్ని ఆరాధించడం వల్లనే తలపెట్టిన పనులు ఆటంకాలు లేక నెరవేరుతాయి.
‘అహమేవక్షయః కాలః’ ‘కాలః కలయతామహం’ అని భగవంతుడే తనను కాల స్వరూపుడనని చెప్పుకున్నాడు. ‘ఋతూనాం కుసుమాకరః’ అని భగవద్గీతలో ఋతువుల్లో ఉత్తమమైన వసంత ఋతువును తానేనని చెప్పుకున్నాడు కృష్ణుడు. అంచేత కాలస్వరూపుడైన భగవంతునితో ముడివడినది - ‘ఉగాది’ పండుగ.
ఇక ‘నందన’ అంటే కూతురు అని అర్థం. కొడుకు కూడా ఆనంద హేతువు కనుకే నందనుడయ్యాడు. నందుని కొడుకుగా కూడా కృష్ణుడిని ‘నందనందనా!’ అని సంబోధిస్తారు. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా.. అందరూ సుఖపడాలి నందనందనా!’ అని పాట కూడా ఉంది కదా. సంవత్సరాలను అరవైగా నిర్ణయించి, వాటికి ప్రభవాది నామాలు మన కాలగణనంలో ఇచ్చారు. ఈ అరవై సంవత్సరాలూ తిరిగి పన్నెండు భాగాలుగా చేశారు. అయిదు సంవత్సరాలు కలిసి ఒక్కో భాగం. దానికి ‘ఖండ యుగం’ అని పేరు. ‘నందన’ ప్రభవాదుల్లో 26వది కాగా, నందన, విజయ, జయ, మన్మధ, దుర్ముఖి అనే అయిదు సంవత్సరాలూ కలిసి ఒక ఖండ యుగం. ఇవి ఆహిర్బుధ్న్య దేవతాకములు. ఈ ఖండ యుగానికి ఆది ఉగాది - ‘నందన’ నామ సంవత్సరమే. ఇందులో మొదటి మూడు హితకరములు, శుభకరములూనట!
తరతరాల తెలుగు సంస్కృతికి ప్రతీక - ఉగాది. ‘కలౌషష్టిర్విధీయతే’ అని కలియుగంలో 60 సంవత్సరాలు జీవించడం పరమావధి. దానికి అనుగుణంగా వచ్చిందే షష్టిపూర్తి. ఉగాది క్కూడా 60 సంవత్సరాలు. 1952లో నందన వచ్చింది. ఇప్పుడు ‘నందన’కు షష్టిపూర్తి అన్నమాట. ‘ఉ’ అంటే ఉత్తమమైన ‘గ’ అంటే జ్ఞానం అనే అర్థంలో - సృష్టిలో మొదట ఏర్పడింది ‘వేదం’ అనే అర్థంలో కూడా ‘ఉగాది’ అన్న భావన కూడా ఉంది.
ఉగాది రోజు ‘పంచాంగ శ్రవణం’ ఎంత ప్రాముఖ్యమైనదో గ్రహించాక, ఉగాది కాలాన్ని దైవ స్వరూపంగా భావించి ఆరాధించే పండుగ అన్నది విదితమే కదా. నేటికి అంటే నందన ఉగాది నాటికి ఈ సృష్టి జరిగి అన్ని యుగాలతో కలిపి 195,58,25,112 సంవత్సరాలైందని ఒక సిద్ధాంతం. కలియుగ సంవత్సరాలు నాలుగు లక్షల ముప్పై రెండు వేలుట! ‘ఉగస్య ఆది ఉగాది’ అనీ, ‘ఉగ’ అనగా నక్షత్రపు నడక అనీ, అర్థం ఉంది. నక్షత్రాలు నడక ప్రారంభించిన కాలం అంటే - సృష్టి కాలం. ‘యుగము’ అంటే ద్వయం లేక జంట అనే అర్థం ఉంది. ఉత్తరాయణం, దక్షిణాయణం అనే ద్వయంతో కూడిన సంవత్సరం అనే అర్థంలో కూడా ‘యుగాది’ అని ఏర్పడిందని కొందరి అభిప్రాయం.
మహిమాన్వితమైన ‘పంచాంగ శ్రవణం’ చేయడానికి అందుకే ఈ ఉగాది రోజు బ్రాహ్మీ ముహూర్తంలో - అంటే తెల్లవారుజామున ఉదయం 4.30 నుండి 5.30 లోపుగానే లేచి, నువ్వుల నూనెతో శరీరాన్ని చక్కగా మర్దించుకుని ‘అభ్యంగన స్నానం’ చేయాలి. కుంకుమ తిలక ధారణ చేసుకుని, కొత్త బట్టలు కట్టుకుని, భగవత్ప్రార్థన చేసుకోవాలి. ఫలం, పుష్పం, తోయం తమ శక్త్యానుసారం దీప ధూప నైవేద్యం కావించాలి. ఎలాంటి ఆహార పదార్థాలను తినక ముందుగానే - ‘ఉగాది పచ్చడి’ని సేవించాలి. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి కూడా - సంవత్సరంలో వచ్చే షడ్రుతువులకూ ప్రతీకాత్మకమే! ఆరు ఋతువులకూ ఆరు రుచుల ఉగాది పచ్చడీ సంకేతంగా, జీవితపు వివిధ పార్శ్వాలకు రసానుభూతి అభివ్యక్తంగా ఉంటుంది. ధర్మబద్ధమైన జీవనానందం అనుభూతి చెందడానికి - ఆరోగ్యమే ప్రధాన సాధనం. ‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్’ అన్నారు. ఉగాది పచ్చడి - ఆరోగ్య పరిరక్షణా హేతువు కూడాను. ఉగాది పచ్చడిలో కలిపే వేప పువ్వు, మామిడికాయ ముక్కలు, కొత్త బెల్లం, ఉప్పు, జీలకర్ర, చింతపండు మొదలైనవన్నీ ఔషధీ గుణాలు కలిగినవే. ఈ ఔషధులకు గల పేర్లు, వ్యుత్పత్త్యర్థాలు ఆ విషయాన్ని స్ఫుటంగా తెలుపుతాయి-
ఆరోగ్యం నయతీతి ‘నింబః’ - అనగా వేప
గుడతి రక్షతీతి ‘గుడం’ - అంటే బెల్లం
లునాతివాతం జాడ్యంవా ‘లవణం’ - అంటే ఉప్పు
సహస్రరోగాన్ విధ్యతే ఇతి ‘సహస్రవేధి’ - అంటే చింతపండు
జీర్యతే అన్నమనే నేతి ‘జీరకః’ - అంటే జీలకర్ర
సహకారయతి మేళయతిస్ర్తి ‘సహకారః’ - అంటే మామిడి.
ఇలా... వేప ఆరోగ్యాన్ని, బెల్లం రక్షణను, ఉప్పు వాత, మాంద్యాల హరణను, చింతపండు పలు రోగ నాశకంగానూ, జీలకర్ర అజీర్ణం పోగొట్టేదిగానూ, ఇక మామిడి స్త్రీ పురుషుల కలయికకు ఉపయోగపడేదిగాను భాసిస్తూ ఉన్నాయి. గర్భిణి పుల్ల మామిడి ముక్కలు తినాలని కోరుకోవడంలోని ఆంతర్యమూ అదే!
శాస్త్రాలలో వేప పూత పచ్చడిని ‘నింబకుసుమ భక్షణం’ అని చెప్పారు. లేత మామిడి చిగురు, అశోక వృక్షం చిగుళ్లు, వేప పూత, కొత్త బెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడి, చెరుకు ముక్కలు కలిపి ఉగాది పచ్చడి చేస్తూంటారు. అలా ఉగాది పచ్చడిని సేవించి పంచాంగ శ్రవణం చేయాలనేది సంప్రదాయం!
ఇంత పవిత్రమైన ఉగాది సంబంధిత వైనం ఈ కాలాన దిగజారుతున్న విలువలతో పరిహాసాస్పదం కావడం శోచనీయం. ‘పచ్చడి చేయడం’ అనేది హింసాత్మక చర్య పదంగా, ‘పంచాంగ శ్రవణం’ అంటే - అసెంబ్లీలో రాజకీయ నేతల పరస్పరారోపణల బూతు మాటలుగా, ‘ఉగాది’ అనేదే ‘ఉట్టి-అడ్డ-గాడిది’ అనే నైజానికి సంక్షిప్తీకరణంగా చెలామణీ కావడం నేటి విడ్డూరమే!
కాలగణన పర్వం అయిన ఉగాది వైశిష్ట్యాన్నీ, పండుగలోని పరమార్థాన్నీ గ్రహించి, నక్షత్ర జ్ఞాన వివేచనం అందుకోగల్గినప్పుడు - ఈ పెడ ధోరణులు దరిచేరవు! ‘నందన’ ఆనంద స్యందనగా తులతూగాలనీ, బ్రతుకు ఆనంద నందనోద్యానంగా విరాజిల్లాలనీ, అందరికీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో... స్వస్తి!! *


  • సుధామ

  • (18/03/2012 )
     

    Tuesday, 1 November 2011

    అవతరణ ఉదయం కానే కాదనుకోవడం నిరాశ




    ష్టపడి చేసుకున్న సంబంధానికీ, పెద్దలు కుదిర్చిన సంబంధానికీ తేడా వుంటుంది. ఇష్టపడి చేసుకున్నవన్నీ విజయవంతాలవుతాయనిగానీ, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు ‘పెటాకులు’ అవుతాయని గానీ నిర్ధారించలేం! ఏమయినా ‘సంబంధాలు’ పెట్టుకున్నప్పుడు, అవి సజావుగానూ, పటిష్టంగానూ, విశ్వసనీయంనూ, ధర్మబద్ధంగానూ, వుండాలనే అభిలషిస్తారు. ‘బంధం’ అన్న మాటలోనే ‘ముడివడడం’ వుంది.ఇంతకీ ‘బంధం’ అనేది- వ్యష్టి నుండి సమష్టి వైపు పయనించడం. వివాహం అనేదాన్ని కూడా సామాజిక దృక్పథంలో వ్యక్తి శక్తిగా మారడంగానే పరిగణిస్తారు.


    ఇంతకీ ప్రేమ, విశ్వాసం, పరస్పర అవగాహన అనేవి ‘సమష్టి’కి అత్యంత ఆవశ్యకాలయిన విషయాలు. మిగతావి ఏవయినా అనుషంగికాలే! ఒక భాష మాట్లాడేవారంతా సమష్టిగా ఒకచోట వుండడం బాగుంటుందన్న సిద్ధాంతం మీద, భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన భారత దేశపు తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా నిజాం నిరంకుశ పాలనలో మ్రగ్గుతున్న తెలుగువారికి స్వేచ్ఛ లభించడానికి విమోచనోద్యమం జరిగింది. తెలుగు భాషనీ, తెలుగుతనాన్నీ నిజామ్ నిర్బంధాలనుంచి ఛేదించుకు వికసింపజేసుకోవడానికి, తెలంగాణలో జరిగిన పోరాటానికి, ఎక్కడి తెలుగువారయినా మద్దతు పలికారు. నిజాం నిరంకుశత్వంలోనే తమ సోదరులు మ్రగ్గి పోవాలని వారు కాంక్షించలేదు. అండదండ, వెన్నుదన్ను అయ్యారు.


    ‘ ఆది కాలమున అందరు జనులు అన్నదమ్ములండీ
    నదులు వనంబులు నానామృగములు నాల్గుసంద్రములను
    కొండలు బండలు జలములు పొలములు గుంటలు సెలయేళ్ళు
    కాయలు పండ్లు పాడిపంటలు ఘనమయినా యిండ్లు
    అంతరువులా భేదముల లేక అందరి సొమ్మండీ’- అంటూ

    కీర్తిశేషులు ఉన్నవ లక్ష్మీనారాయణగారు రాసిన ‘మాలపల్లి’ నవలలో ఒక బుర్రకథ దళం ప్రబోధించిన సమతాధర్మం. ఆదికాలంలో సమష్టిజీవనం వుండేదనేది నిర్వివాదాంశం. ప్రకృతితో పారాడడానికి పెనుగాలులు, తుపానులు, అడవి మృగాలనే గండాలనుండి అధిగమించడానికి సమష్టిగా శ్రమించక తప్పని మార్గం నాడుండేది. నిజానికి మొదట్లో ‘భాష’కూడా లేదు కదా.


    ‘భాష’ అనేది భావ వినిమయ సాధనంగా వికసించింది. మూకీ చిత్రాలు టాకీ చిత్రాలుగా మారినప్పుడు ‘ప్రపంచ భాష అయినమౌనంముక్కలైపోతోంద’ని ప్రముఖ హాస్యనటుడు ఛార్లీ ఛాప్లిన్ కంటతడిపెట్టాడట. భాషాప్రయుక్త రాష్ట్రాలనే ప్రతిపాదన మొదట గాంధీగారిదేననీ, ఆ తర్వాత నెహ్రూ దానికొక రూపకల్పన చేసారని అంటారు.హిందీ మొదలైనవి ఆర్యభాషలుగా, తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, వంటివి ద్రావిడ భాషలుగా గుర్తిస్తున్నాం. ఉత్తరాదివారిని ఆర్యులుగా, దక్షిణాదివారిని ద్రవిడులుగా మౌలికంగా భావించడం వుంది. హిందీ మాట్లాడే వారి సంఖ్య అధికం అంటూ- పాలనా సౌలభ్యం కోసం వివిధ రాష్ట్రాలుగా అంగీకరించి, కేవలం తెలుగు, తమిళ, కన్నడం వంటి భాషలు మాట్లాడేవారిని ఒకటిగా చేర్చి ఒకే భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పరచాలన్న ఆలోచన ఆనాటిది. అప్పట్లో తెలుగువారు మూడుకోటులే. ‘మూడుకోటుల నొక్కటే ముడి బిగించి’, ‘మహాంధ్రోదయాన్ని’- నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాహిత్యంలోను ఉద్యమించిన దాశరధి ఆహ్వానించాడు.


    తెలుగువారందరికీ ఒకే రాష్ట్రం ఏర్పరచడం, ‘విశాలాంధ్ర’ ప్రాతిపదిక ఏర్పడడం జరిగినప్పుడు, తెలంగాణ ప్రాంతపు తెలుగువారిని ఇతర ప్రాంతపు తెలుగువారితో కలపడాన్ని నెహ్రూగారు అన్నదమ్ముల సంబంధంగా కాక భార్యాభర్తల సంబంధంగా అంటూ- ‘అమాయకపు భార్య- గడసరి భర్తను ముడివేస్తున్నామనీ, ఈ బంధం ఎంత కాలం పటిష్టంగా వుంటుందో తెలియదని, మున్ముందు విడిపోతే విడిపోవచ్చు అన్నారని ప్రచారంగా వినిపిస్తున్న మాట ఒకటుంది! అప్పుడు కూడా రాజకీయాలు ఎన్నో నడిచాయి! ‘ఆంధ్రప్రదేశ్’ ఏర్పడటం వెనుక కథ ‘ఆంధ్రుల కథ’లో నిర్దుష్టంగా తెలుస్తూనే వుంది.

    అప్పుడు ఆంధ్ర, తెలుగు అనే పదాలు పర్యాయాలుగా భావించబడ్డాయే తప్ప ‘వేర్వేరు’ అన్న భావన లేదు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అన్న విభజన, ప్రాంతాలను బట్టిగానీ, భాషాపరంగా, మూడూ ‘తెలుగు’ భాష మాట్లాడేవే. ‘తమిళనాడు’ లాగా- ‘తెలుగునాడు’ అని ఆనాడే పేరు పెట్టివుంటే ఎలా వుండేదో మరి? రానురాను ‘ఆంధ్ర’ అనేది మాత్రమే కాదు, తెలంగాణలో ‘తెలుగు’ అనే పదానికి వైమనస్యం మొదలైంది. ‘తెలుగుతల్లి’ అన్నపదం కూడా నచ్చని వైఖరి ఎందుకొచ్చిందో పూర్తి వివరణ లభించనేలేదు అన్న భావన వుంది.


    అన్నదమ్ముల బంధం అంటే-విడిపోవడం, ఆస్తుల పంపకం అనే మాట రావచ్చు. కానీ నెహ్రూగారు భార్యాభర్తల బంధం అన్నారు. భారతీయ వివాహవ్యవస్థ-వట్టినే విడాకులు కోసం వెంపర్లాడేది కాదు ! మైక్రోఫ్యామిలీలు పెరుగుతున్న నేటి కాలంలో మానవ సంబంధాలలో-ఉమ్మడి కుటుంబం గురించీ, అన్నదమ్ములూ, కుటుంబం యావత్తూ కలిసివుండటంలోని ఉదాత్తత గురించీ, ఏప్రాంతపు కవులూ, రచయితలైనా మానవీయ విలువల గురించి ఆరాట ప్రకటనం చేస్తూనే వున్నారు. అటువంటప్పుడు ఒంటెద్దు పోకడలు వ్యవసాయాన్నైనా కుంటుపరచేవేగా! ‘యాంత్రికత’ ప్రయోజనాలన్నింటినీ పొందుతూనే, మనిషి మాత్రం ‘యంత్రం’గా మారిపోరాదని ఆరాట పడుతున్నామాయె!

    భార్య అయినా అమాయకంది అయినా- భర్తని తన అనురాగంతో చెప్పుచేతల్లో వుంచుకోగలదు. ఎంతటి గడసరి, మేధావి అయిన భర్త అయినా, ‘దురంత పద్మవ్యూహాల వల్ల కానిది రవంత అనురాగం వల్ల అవుతుంది’ అని ‘సినారె’ అన్నట్లు, భార్యా విధేయుడుగా వుండడం లోనూ వైచిత్రి లేదు. అసలు భార్య దృష్టిలో భర్తే అమాయకుడు. తను ‘నీడపట్టు మనిషి’ కావడం వల్లనే మొగుడు ఏదయినా సాధించగలడు! ఇంతకీ భార్యకోసం కష్టించే భర్తలు లేరా? ‘భార్యా భర్తల బంధం’ అంటే నిజానికి అది మరింత పటిష్టంగా వుండాలన్న సూచనే వుంది గానీ, చీటికీ మాటికీ కాట్లాడుకుని పుట్టింటిని ఆశ్రయించడాలూ, మొగుడిని కొట్టి మొగసాలకెక్కడాలూ మన సంస్కృతిలో ప్రోత్సహింపబడలేదు. అన్నదమ్ములన్నా,భార్యాభర్తలన్నా పరస్పర బంధం గురించే మానవీయంగా ఆలోచించడం జరుగుతుంది కానీ, వైషమ్యాల గురించి కాదు.


    నిజమే! ‘సెంటిమెంట్స్’ బలీయమైనవి. ‘ఆత్మగౌరవం’ ప్రధానమైనది. పరస్పరం ప్రేమ, విశ్వాసం ఒకరి కోసం ఒకరు-ఒకసారి ఒకరైతే, మరొకసారి మరొకరు- ‘అడ్జస్ట్’ అవుతూ, గిల్లికజ్జాలను చిలికి చిలికి గాలివానల్లా పెంచుకోక, పరస్పరాభిప్రాయాలను గౌరవించుకుంటూ, ఒకరి అభ్యున్నతికి మరొకరు దోహదపడుతూ సాగడమే ఉదాత్తమైన ఆశ, ఆశయం. కానీ వ్యవస్థ అంతా సజావుగా సాగితే అవస్థలు దేనికి?

    గుంపులు గుంపులుగానే మబ్బులు కొండను ఢీకొంటే వర్షం కురుస్తుంది. అలలు అలలుగానే సముద్రం ముందుకురికితే పడవ సాగుతుంది. జ్వాలలు జ్వాలలుగానే నిప్పు ఆహారాన్ని పచనం చేస్తుంది. తారలు తారలుగానే ఆకాశం చంద్రునితో వెలుగు వెన్నెలని పరుస్తుంది. పొరలు పొరలుగానే నేల సారవంతమైన పంటలనిస్తుంది. ‘కలయిక’లో ఇంతకలిమి, సమష్టిలో ఇంత అభివృద్ధి వుండడం చూసి కూడా వేరు పడటం కోసం మనుషులు గుంపు కట్టారంటే ఆలోచించవద్దా? కలుసుకోవడం విడిపోవడం కోసమే అయితే ‘అవతరణ’ విచ్ఛిన్నం కోసమే అయితే, విడిపోయాక కలుసుకోవడం కోసమూ, ఆరాటపడటం అంతే సహజమని, కవులు, రచయితలు, మానవ సంబంధాలు గూర్చిన ఆలోచనలు మరోమారు అర్థం చేసుకునేలా చేస్తుంటాయి.

    సంసారాల్లో నిప్పులు పోయాలని చూసేవారూ ఉంటారు. సామరస్య జీవనం కోసం ‘మ్యారేజ్ కౌన్సిలింగ్’ చేసేవారూ వుంటారు. కలిసి వుండాలా, విడిపోవాలా తేల్చుకోవలసింది వారిద్దరే. విడాకులు పుచ్చుకోకుండానే విడివిడిగా బ్రతికేవారూ వున్నారు. లీగల్‌గా విడిపోయి సహజీవనం చేసేవారూ వున్నారు. ‘ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవడానికీ, పడగొడితే పడిపోవడానికీ’ బాల చాపల్యమయితే గ్రహించగలం కానీ, ‘నిర్ణాయకశక్తి’ నిర్దేశిస్తే, అది మేలుకేనని మేలుకోకపోతారా?


    ‘అవతరణ’ చరిత్ర గురించి ఇప్పుడు తవ్వుకోనక్కరలేదు. ‘గతకాలము మేలు వచ్చుకాలముకంటెన్’ అన్నది ఎంత బలీయ భావనో, ‘మంచిగతమున కొంచెమేనోయ్’ అన్నదీ బలీయమే! ఇంతకాలం ఇంతదారిని నడిచి వచ్చేసాక- ‘అభివృద్ధి’ని బేరీజు వేసుకోవడం ‘అభివృద్ధి’ గురించే ఆరాట పడటం, ఆ అభివృద్ధి ఏమార్గాన వేగవంతమవుతుందని తపించడం, స్వయంశక్తి తప్ప సహాయ సహకారాలేమే అవసరం లేదనీ, తనగురించి తనే- అంతా తానుగా చూసుకోగలననీ ఉద్వేగపడడం ఎందుకు జరుగుతోందో- అర్థం చేసుకోవాలి! బలవంతం దేనిలోనూ పనికిరాదు. ‘బలోపేతమే’ పనికివస్తుంది.


    ఇంతకీ పరిణామాలేవయినా మానవీయంగా పరిమళించాలి. సామాన్యుడు సంతోషించాలి. కాళోజీ అన్నట్లు-

    ‘ఉదయం కానే కాదనుకోవడం నిరాశ
    ఉదయించి అలానే వుంటుదనుకోవడం దురాశ’


    ఏదేమయినా ‘తెలుగు మాట్లాడే దీపాలు తెల్లవార్లూ వెలుగుతుంటాయి’ అని తెలంగాణపై ‘త్వమేవాహం’ వెలువరించిన ‘ఆరుద్ర ఆశ’ చిగురిస్తూనే వుండాలని ఆశిస్తే తప్పేం కాదు.

    Friday, 9 September 2011

    'తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం '






    చిలిపి కుంచెను పట్టి
    శ్రీకారమును చుట్టి
    నవ్వించె తలిశెట్టి
    ఓ కూనలమ్మా!


    ఆది కార్టూనిస్ట్
    అనుచు తలుచుచు ఫస్ట్
    కీర్తించుటే బెస్టు
    ఓ కూనలమ్మా!


    అన్నారు ఆరుద్ర గారు.


    తలిశెట్టి రామారావు గారి కార్టూన్లు భారతి మాసపత్రికలో 1930 ప్రాంతాల్లో విరివిగా ప్రచురింప బడ్డాయి. అయితే ఆయన కార్టూన్లు ఈ తరం వ్యంగ్యచిత్ర కారులు ఎక్కువ చూసే అవకాశం కలుగలేదు. ఆ లోటు తీరుస్తూ శ్రీ ముల్లంగి వెంకట రమణారెడ్డి గారు కేవలం సాహిత్యం పట్ల,తలిశెట్టి వారి కార్టూన్ల పట్ల వున్న ఆసక్తితో వారి వ్యంగ్య చిత్రాలు ఎన్నో సేకరించి  గ్రంధంగా ప్రచురించారు.


    'తలిశెట్టి రామారావు -తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు' ఇప్పుడు పుస్తకంగా లభిస్తోంది.




    ఈ రోజు (9.9.2011)'ముఖీ మీడియా 'పక్షాన ప్రముఖ కార్టూనిస్ట్ ' బ్నిం' రమణారెడ్డి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ క్రోక్విల్ అకాడెమీ వ్యవస్థాపకులు ప్రముఖ కార్టూనిస్ట్ శంకు,'కినిగె' ఈ- బుక్స్ అనిల్ అట్లూరి, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ వంగీపురపు.ఆర్.కుమార్ ప్రభృతులతో, నేనూ ఆ సమావేశం లో పాల్గొనడం ఆనందం కలిగించింది.


    ఈ సందర్భంగా తలిశెట్టి వారి గురించి విశ్లేషిస్తూ చిన్న ప్రోగ్రాం దృశ్యీకరించడం విశేషం.


    మరో ఆనందకర విషయం ఇకనుంచీ ప్రతి ఏడాదీ తలిశెట్టి వారి జన్మదినమైన మే 20 వ తేదీని 'తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం ' గా పాటించాలని ప్రతిపాదించడం జరిగింది. దీనికి కార్టూనిస్టుల అందరి ఆమోదం లభించగలదని భావన.


    వచ్చే ఏడాది మే 20 నాటికి తలిశెట్టి వారిపై శంకు ఒక డాక్యుమెంటరీ తీస్తానని ప్రకటించారు.దీనికి తగిన సామగ్రి అందచేస్తానని రమణారెడ్డి గారు ముందుకొచ్చారు.


    తలిశెట్టి వారి కుమారులైన డాక్టర్.జైరాం గారు రమణారెడ్డి గారికి పరిచయం కావడం ,వారు తలిశెట్టివారి ఫొటొ ఒరిజినల్ ఇవ్వడం మాత్రమే కాక ఆయన వేసిన, ఇప్పటి సంకలనంలో లేని అదనపు కార్టూన్లు,వారి వ్యాసాలు కూడా ఇవ్వడం ఒక శుభ పరిణామం.


    తలిశెట్టి వారి వర్ధంతి 14.మార్చి 1947 అని ఆనందవాణి పత్రిక లో నేను స్వయంగా చూశాను. ఆనందవాణి కి చెందిన శ్రీ ముద్దా విశ్వనాధం గారు 'వ్యంగ చిత్రాలతో దివ్య సందేశాలిచ్చిన మన త.రా తరలి పోయారు 'అని శ్రద్ధాంజలి ఘటించారు.ఆ విషయం నేను తెలిపి మార్చి 3 అని పొరపాటు గా నమోదయిన వర్ధంతి తేదీని కూడా సవరింప చేయడం జరిగింది.


    ఏమైనా రమణారెడ్డి గారు తీసుకుంటూన్న శ్రద్ధ మనమంతా అభినందించదగింది.


                   తలిశెట్టి రామారావు గారి జయంతి అయిన 20 మే ఇక పై తెలుగు కార్టూనిస్టుల దినోత్సవంగా చరిత్రాత్మకమవుతుందని మనసారా ఆకాంక్షిద్దాం.


    తెలుగు కార్టూనిస్టులు అందరూ దీనికి తమ సంఘీభావం తెలుపుతూ శంకు గారికి గాని,బ్నిం గారికి గాని తమ ఆమోద లేఖలు పంపవలసిందిగా ప్రార్థన.తెలుగు కార్టూనిస్టుల డాట్ కాం కు తెలియజేసినా శ్రీ పుక్కల రామకృష్ణ గారు దోహదం చేస్తారు అన్నది అందరి విశ్వాసం.


    అందరికీ నమస్సులతో..

    సదా మీ..
    సుధామ.
     

    మచ్చుకు తలిశెట్టి వారి ఓ కార్టూన్


    Monday, 11 July 2011

    రేడియో హీరోయిన్ శ్రీమతి.శారదా శ్రీనివాసన్



    రేడియో హీరోయిన్
    శ్రీమతి.శారదా శ్రీనివాసన్



    రేడియో హీరోయిన్ అంటే
    ఎవరికైనా గుర్తుకొచ్చేది శ్రీమతి.శారదా శ్రీనివాసన్ గారే.

    ఆకాశవాణి చేసుకున్న పుణ్యఫలం ఆవిడ.

    ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నాటకవిభాగం
    వైభవప్రాభవలతో వెలుగొందిన ఆ రోజుల్లో
    శ్రీ.నండూరి విఠల్, ఆవిడ, రేడియో హీరోహీరోయిన్లుగా
    అసంఖ్యాక శ్రోతల హృదయాలలో స్థిరవాసం ఏర్పరచుకున్నారు.
    అలాగే కె.చిరంజీవి గారితో శారదగారి నాటకాలు కూడాను.













    శ్రీ.నండూరి విఠల్


                                                                                         







                                                                                           కె.చిరంజీవి









    శారదగారి కంఠం అంటే చిన్నప్పటినుండీ నాకు చాలా ఇష్టం.


    అలాంటిది రేడియోలో నేను ఉద్యోగం చేస్తానని గాని,
    ఆవిడ అభిమానాన్ని చూరగొంటాననిగాని,
    ఆవిడతొ నాటకాలలో నటించే అవకాశం వస్తుందని గాని
    ఎలా వూహించగలను.
    కానీ అదే జరిగింది
    ..'మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో..'గానీ.

    కౌముది నెట్ మాసపత్రికలో
    నా రేడియో జ్ఞాపకాలు రాస్తున్నాను.
    అందులో ఆ జ్ఞాపకాలన్నీ ఎలాగూ తలుచుకుం(టూం)టానుగానీ,
    నేను కౌముదిలో,
    శ్రీ డి.వెంకట్రామయ్య గారు 'రచన' మాసపత్రికలో
    మా రాతలు రాస్తూండగానే

    నిశ్శబ్ద విప్లవం లా
    శ్రీమతి.శారదా శ్రీనివాసన్ గారు
    తమ 'నా రేడియో అనుభవాలు,జ్ఞాపకాలు '
    అనే అద్భుత రచనను
    పుస్తకంగా తెచ్చి
    అందరికీ ఆశ్చర్యానందాలను కలిగించారు.




    నిన్న 10 జూలై 2011 న
    హైదరాబాద్ చిక్కడపల్లి లోని నగరకేంద్ర గ్రంథాలయంలో
    డాక్టర్.చాట్ల శ్రీరాములు గారు ముఖ్య అతిథిగా .
    శ్రీ.ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి అధ్యక్షతన,
    డాక్టర్.వాడ్రేవు చిన వీరభద్రుడుతన అద్భుత విశ్లేషణా ప్రసంగంతో విశిష్ట అతిధిగా,
    డాక్టర్.కె.బి.లక్ష్మి ఆత్మీయ అతిథిగా
    క్రిక్కిరిసిన ప్రేక్షకులతో జరిగిన సభ
    ఒక మరపురాని తలుచుకునే తరుణం.


    తమ ఎదిగీఎదగని కుమార్తె  అమాయిక  చి.సౌ.నీరదకు
    ఆ గ్రంథాన్ని ఆవిడ అంకితం చేసారు.


    ఆవిష్కరణ జరిగిన 10 జూలై
    ప్రముఖ వేణుగాన సంగీత విద్వాంసులు,
    రేడియోలో సంగీత విభాగం ప్రొడ్యూసర్ అయిన
    హాస్యచతుర విశిష్ట వ్యక్తి కీ.శే.శ్రీనివాసన్ గారితో
    శారదగారి వివాహం జరిగిన రోజు కావడం ఒక విశేషం.



    శారద గారి పుస్తకంలో
    నాకూ ఒక పేజీ లభించడం ,
    నా గురించీ ఆవిడ రాయడం
    ఎంతో ఆనందం కలిగించిన విషయం.



    శారదగారు
    తన మనసుకు హత్తుకుపోయిన కార్యక్రమాలలో
    నేను రాసిన ఉదయతరంగిణి ని కూడా
    జ్ఞాపకం చేసుకోవడం
    నాకు పరమానందం.



    మనసు కవి ఆత్రేయ మాటలలో శారద





















    పుస్తకం మీరెలాగూ చదువుతారు గానీ
    ఈ లోగా నా ఆనందాన్ని ప్రకటించుకోవడానికే
    ఈ నాలుగు మాటలూ..

    పుస్తకం వెల కేవలం 125 రూపాయిలు.


    శారద గారి చిరునామా:
    శ్రీమతి.శారదా శ్రీనివాసన్ ,
    204,సీతారామ ఎంక్లేవ్,
    స్ట్రీట్ నం.10,హిమాయత్ నగర్,
    హైదరాబాద్.29.



    ఈ పుస్తకం చదవడం ఒక అనుభవం .వదులుకోకండేం!
    ఈ పుస్తకం పై 2011 సెప్టెంబర్ 4 ఆదివారం ఉదయం 11.30 కు టి.వి.9 లో బుక్ పాయింట్ కార్యక్రమంలో సుధామ,కె.బి.లక్ష్మి పాల్గొన్నారు.ఆ వీడీయో రెందు భాగాలుగా కింద లింకులలో చూడవచ్చు
    http://youtu.be/cPpo_fIJRPk
    http://youtu.be/beOJsqjfAEU

    Wednesday, 22 June 2011

    'రసరంజని 'నాటకోత్సవాలు



    ప్రముఖ నటులు,దర్శకులు,నాటక రచయిత,జానపద కళా ప్రయోక్త అయిన

    శ్రీ మొదలి నాగభూషణ శర్మ గారికి 

    (75 సంవత్సరాలు నిండిన)
    అమృతోత్సవ శుభ సందర్భంగా

    హైదరాబాద్ రసరంజని సంస్థ వారు

    ఈనెల జూన్ 25 నుండి 29 వరకు
    రవీంద్రభారతి లో నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారు.
    రోజూ ఒక నాటక ప్రదర్శనతో హాస్యం పండించబోతున్నారు.

    ఆ వివరాల బ్రోషర్ ను నా చేతి రాతతో
    శ్రీ.కె.వి.రమణ గారు (ఐ.ఏ.ఎస్)రూపొందింపచేసారు.

    అందరూ ఆహ్వానితులే!

    ఇవిగో ఆ వివరాల బ్రోషర్ పేజీలు.