వర్షవర్షానికీ తను సంతరించుకునే కొంగ్రొత్తలు-
మన శుభ జీవన భవనపు ఆశల పునాదులు.
తన కదలికనీ, ఆ కదలిక మనపై ముద్రించే
అనుభవ చిత్రాలనీ తిలకించి స్పందిస్తూంటాం.
అకృత్రిమ సౌందర్యరాశి,
ఋతుక్రమాన ఆసాదిత యౌవ్వన కన్యక - ఉగాది.
ఇక నందన ఉగాది.
ఉగాది -
మన జీవితమంతా ఆధారపడి వున్న కాలానికి సంబంధించింది.
మృత్యు శిశిరాలు వెళ్లిపోతూ, జనన వసంతాలు వస్తూంటాయి.
వసంతం మావి చిగురునూ, కోయిల పాటనూ తెస్తుంది.
అంటే - ఆశనూ, ఆనందాన్నీ ఇస్తుంది.
కొత్త సంవత్సరారంభాన్ని ‘ఉగాది’ పండుగ రూపంలో అందుకుంటాం.
కాలం - నిముషాలు, గంటలు, తేదీలు, వారాలు, పక్షాలు, మాసాలు, ఆయనాలు, సంవత్సరాలు, యుగాలుగా కొలుచుకుంటున్నా, కాలాన్ని మనం భగవత్స్వరూపంగా సంభావించుకుంటాం!
గిర్రున తిరిగే కాలం వల్ల చిత్రవిచిత్ర రీతులు పొందే ప్రకృతిని అర్థం చేసుకుంటూ, తదనుగుణంగా మన జీవితాలను తీర్చిదిద్దుకునే ఇహపర సాధనోత్సాహమే ఉగాది. ఉగాది పండుగలోని పరమార్థం అదే!
ప్రతి సంవత్సరం - చైత్ర శుద్ధ పాడ్యమితో మొదలవుతుందిది. మన తెలుగు సంప్రదాయంలో, ఏటా ఈ ఆరంభ దినాన్ని, మాసాలలో మొదటిదైన చైత్రమాసం తొలి రోజుని, ఋతువుల్లో మొదటిదయిన వసంత ఋతు ప్రారంభ దినాన్ని, తిథులలో మొదటిదైన పాడ్యమినాడు, పక్షాలలో మొదటిదైన శుక్ల పక్షం నాడు వచ్చే మొదటి దినాన్ని, - ‘ఉగాది’ అంటారు. బ్రహ్మ తన సృష్టిని ఆరంభించిన రోజు కనుక ‘యుగాది’గా పేర్కొంటారు.
ఉగాది రోజు పంచాంగ శ్రవణమే ప్రథమగణ్యంగా గుర్తించాలి! కాలగణనంలో పంచాంగ విధానమే సమగ్రం, శాస్త్రీయం కనుక ఆది‘పర్వం’ ఉగాది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు కలిసి ‘పంచాంగం’ అయింది. ఈ అయిదు అంశాల బలాబలాలను ఋషులు నిర్ణయించి శాస్త్రాలు రాశారు. పంచాంగం చేసేప్పుడు పంచాంగ కర్తలు సృష్ట్యాదిగా గతించిన దినములు తీసుకుని గణన చేస్తారు. అంటే సృష్టి ప్రారంభమైన తొలి రోజు నుంచీ కాలాన్ని లెక్కగడుతూంటారన్న మాట.
అమావాస్య నాడు సూర్యునితో కలిసి వుండే చంద్రుడు - ప్రతి దినం కొంచెం కొంచెంగా తూర్పువైపుగా దూరమౌతుంటాడు. మొదటి దినం దూరానికి ‘పాడ్యమి’ అనీ, రెండవ దూరం విదియ, తృతీయ తదియ, నాలుగోది చవితి ఇలా.. సూర్య చంద్రుల దూరానికీ ‘తిథు’లని పేరు. కృష్ణపక్షంలో దూరాల తగ్గుదల, శుక్లపక్షంలో దూరాల పెంపుదల జరుగుతుంది. ఇక రెండోదిగా పంచాంగంలో గుర్తించేది ‘వారం’. ‘ఉదయాదుదయం వారం’ అంటే ఇవాళ సూర్యోదయం మొదలు మరునాడు సూర్యోదయం వరకూ ‘వారం’ మాత్రం మారదు.
‘తిథి’ ఇరవై నాలుగ్గంటల్లో ఎపుడయినా మారిపోతూంటుంది. ఒక్కొక్క తిథి మర్నాడు కూడా కొంతసేపు ఉంటుంది. ‘తిథి’ చంద్రగమనం వల్ల ఏర్పడేది కావడమే దానికి కారణం. తర్వాతది ‘నక్షత్రం’. ఇవి 27. ఒక్కొక్క నక్షత్రం సరళ రేఖలో చంద్రుడు ఎంతసేపుంటాడు అన్న దానినిబట్టి ఆ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవత వుంటాడు. ఆ దేవత స్వభావాన్ని అనుసరించి ఆ నక్షత్ర ఫలితాలను నిర్ణయిస్తారు. అశ్వనీ నక్షత్రానికి అధిపతులు అశ్వనీ దేవతలు కనుక చంద్రుడు ఆ నక్షత్రంతో సరళ రేఖలో వున్నప్పుడు చికిత్సకు మంచిదన్న మాట! ‘చంద్రుడు’ - మనకు దగ్గరగా వుండే గ్రహం. పైగా స్ఫటికం దగ్గర ఏ రంగు పువ్వు పెడితే స్ఫటికం ఆ రంగులో కనపడేటట్లుగా - ఏ నక్షత్రం దగ్గర సరళ రేఖలో వుంటే ఆ నక్షత్ర గుణ స్వభావాలతో చంద్రుడు ప్రభావం వేస్తాడన్నమాట! ఈ నందన ఉగాది నాటి ఉత్తరాభాద్ర నక్షత్రం - ఉత్తర, ఉత్తరాషాఢ, వలె అన్ని శుభాలకూ మంచిది. చంద్రుడు శుద్ధ సప్తమి నుంచి కృష్ణపక్ష సప్తమి వరకు పూర్ణ బలవంతుడు కనుక ఆ మధ్యకాలంలోని ముహూర్తాలకు బలం ఎక్కువ. నవగ్రహాలన్నీ కూడా వాటి సంచారాన్ని అనుసరించి, ఒక్కొక్క కోణంలో వుంటాయి భూమికి. ఆయా గ్రహాల ఆయా కోణాలను బట్టి వాటి ప్రభావాలు భూమి మీద వేర్వేరుగా ఉంటాయి. అందుకే కార్యసాధనకు ‘గ్రహబలం’ తోడు కావాలనేది! పంచాంగంలో ‘యోగం’ కూడా 27 రకాలు. అందులోనూ మంచీ చెడూ ఉంది. ఇక ‘కరణం’గా చెప్పుకునేది తిథిలోని అర్ధ్భాగం. ఇవి పదకొండు. వీటిల్లోనూ కొన్ని మంచివి కొన్ని చెడ్డవీ అంటూ వున్నాయి. ఇలా కాల వివరణ పంచాంగబద్ధమై, పంచాంగ మగ్నమై వుంది.
‘తిథి’ సంపదను, ‘వారం’ ఆయుష్షును ఇస్తుంది. ‘నక్షత్రం’ పాపాలను పోగొడుతుంది. ‘యోగం’ రోగ నివారణ చేస్తుంది. ‘కరణం’ కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాలం తెలిసి, పంచాంగాన్ని అనుసరించే నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించేవారు - దేవతానుగ్రహం పొందుతారని పంచాంగ ఫలం.
తిథేశ్చశ్రీయామాప్నోతి వారాదాయుష్యవర్ధనమ్
నక్షత్రాదర్హతే పాపం యోగాద్రోగ నివారణమ్
కరణాత్కార్య సిద్ధిస్తు పంచాంగ ఫలముత్తమమ్
కాలవిత్కర్మకృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్
అంతేకాదు! ‘పంచాంగం’ సిరిసంపదలు కలిగిస్తుంది. శత్రువులను నశింపజేస్తుంది. చెడు స్వప్న దోషాలను పోగొడుతుంది. గంగాస్నానం చేసిన పుణ్యాన్ని, గోదానంతో సరితూగే పుణ్యాన్ని కూడా ఇవ్వగలదు. ఆయుష్షును వృద్ధి చేస్తుంది. మంచి శుభాలనూ, సంతానాది భోగభాగ్యాలను కలిగిస్తుంది. అనేక పనులను సులభసాధ్యాలుగా చేస్తుంది. కాబట్టే ‘పంచాంగ శ్రవణానికి’ ఎంతో ప్రాధాన్యం ఉంది.
‘శ్రీ కల్యాణ గుణావహం
రిపుహరం దుస్స్వప్న దోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం
గోదాన తుల్యం నృణామ్
ఆయుర్వృద్ధి దముత్తమం శుభకరం
సంతాన సంపత్ప్రదమ్
నానాకర్మ సుసాధనం సముచితం
పంచాంగమాకర్ణ్యతామ్’ - అని చెప్పబడింది.
‘పర్వం’ అంటే పండుగ. పండుగ చేసుకోవాలి అంటే ప్రకృతి, పరిసరాలు అనుకూలించాలి. చైత్ర శుద్ధ పాడ్యమి - అంటే ఉగాది రోజు నుంచి, వైశాఖ బహుళ అమావాస్య వరకూ రెండు నెలల కాలం వసంత ఋతువు. ‘వసంతం’ రాగానే మ్రోడులు కూడా చిగురిస్తాయి. చెట్లన్నీ పూలతో శోభిల్లుతూంటాయి. మామిడి చెట్లకు కాయలు గుత్తులు గుత్తులుగా వ్రేలాడుతాయి. రంగులతో, పరీమళాలతో ప్రకృతి పచ్చదనంతో శోభాయమానంగా, రసానందమయంగా ఉంటుంది.
చిగురు చిగురున రాగశీకరము లొలికించి
ఆకునాకున మరకతాకృతి పలికించి
పూవు పూవున మధువు పుకిలింత లొనరించి
వచ్చె కుసుమాస్త్ర భాస్వంతము వసంతమ్ము
అంటారు ‘ఋతు చక్రం’ కవి సినారె. మావి చివురులు తిని కోకిలలు మనోహరంగా కూసే కాలం ఇదే. వసంతాన్ని వర్ణించని కవులెవరు? రమణీయ కాల గణనంలో - వసంతానికే అగ్ర తాంబూలం. ఈ కాలంలో పుష్పాలలో ‘మధువు’ అంటే - తేనె ఎక్కువగా ఉంటుంది కనుకనే, ‘మధుమాసం’ అనీ పేర్కొంటారు.
పుంస్కోకిలశ్చూత రసాసవేనమత్తః
ప్రియాం చుంబతి రాగ హృష్టః
కూజద్ద్విఫో స్యయ మంబుజస్థః
ప్రియం ప్రియాయాః ప్రకరోతిచాటు
అంటూ మహాకవి కాళిదాసు తన ఋతు సంహార కావ్యంలో వసంత శోభను వర్ణించాడు. ఆమ్రరసమనే మద్యం తాగి, మదించిన మగ కోకిల, అనురాగంతో తన ప్రేయసిని ముద్దాడుతోంది! కమలం మీద వాలి ఝంకారం చేస్తున్న భ్రమరం కూడా తన ప్రియురాలిపైన ఎంతో గొప్పగా ప్రేమ ప్రకటిస్తుంది. ‘వసతి సుఖం యధాతథా స్మిన్నితి వసంతః’ అంటూ - జనులు సుఖంగా వుండే కాలం కనుక, వసంత కాలమనే పేరు వచ్చిందని చెప్పబడింది.
కామధేనువుకు ‘సురభి’ అనే పేరుంది. కోరిన కోర్కెలు తీర్చే కాలంగా మధుమాసానికి అందుకే ‘సురభి’ అనే పేరు కూడా వ్యవహారంలో ఉంది. దశరథుడు పుత్రకామేష్టి వసంత కాలంలోనే చేసి అభీష్ట ఫలసిద్ధి నొందాడని వాల్మీకి -రామాయణంలో రాశాడు. అందువల్ల ఉగాదినాడు ప్రారంభించిన పనిగానీ, అసలు వసంత కాలంలో మొదలెట్టిన పనులు ఏవయినా గానీ - ఆటంకాలు లేక పూర్తవుతాయనేది విశ్వాసం.
సీతారామ కల్యాణం కూడా మధుమాసంలోనే జరిగింది. చైత్ర వైశాఖాలు - వసంత ఋతువు. చిత్తానక్షత్రయుక్త పూర్ణిమ, విశాఖా నక్షత్రయుక్త పూర్ణిమలతో కూడిన రెండు నెలలూ మధుమాసాలే! వైశాఖమే ‘మాధవ’ అనే శబ్దంతో చెబుతారు. శ్రీకృష్ణుడు కూడా మాధవుడే. ‘కృష్ణ’ అనే పదంలో ‘కృష్’ ధాతువుకు అర్థం సత్త. ‘ణ’ అన్న దానికి అర్థం నిర్వృతి. అంటే ఆనందం. ఈ రెంటి కలయిక ‘కృష్ణ’ అంటే సదానందమన్నమాట!
‘విశాఖ’ నక్షత్రానికి ‘రాధా’ అనే పేరుంది. వైశాఖ మాసాన్ని ‘రాధః’ అని కూడా అంటారు. రాధాకృష్ణుల తత్వానికి సంకేత కాలం కూడా ఇదే. రాధాకృష్ణులనగానే - వారి మధ్యగల ప్రేమానురాగాలు, రాసలీలలు గుర్తుకొస్తాయి. వేదం ‘ఆనందోబ్రహ్మేతివ్య జానాత్’ అంటూ సదానందమే పరబ్రహ్మమంది. ఆ పరబ్రహ్మయే ‘కృష్ణ’. ‘కర్షతీతి కృష్ణః’ అని - ఆకర్షించేవాడు కృష్ణుడు. జీవాత్మ అయిన ‘రాధ’, పరమాత్మ అయిన ‘కృష్ణ’లో సంగమించడమే అమందానంద సదానంద బ్రహ్మానంద యోగం! సదానంద రూపమైన పరిపూర్ణ రూపాన్ని ఆరాధించడం వల్లనే తలపెట్టిన పనులు ఆటంకాలు లేక నెరవేరుతాయి.
‘అహమేవక్షయః కాలః’ ‘కాలః కలయతామహం’ అని భగవంతుడే తనను కాల స్వరూపుడనని చెప్పుకున్నాడు. ‘ఋతూనాం కుసుమాకరః’ అని భగవద్గీతలో ఋతువుల్లో ఉత్తమమైన వసంత ఋతువును తానేనని చెప్పుకున్నాడు కృష్ణుడు. అంచేత కాలస్వరూపుడైన భగవంతునితో ముడివడినది - ‘ఉగాది’ పండుగ.
ఇక ‘నందన’ అంటే కూతురు అని అర్థం. కొడుకు కూడా ఆనంద హేతువు కనుకే నందనుడయ్యాడు. నందుని కొడుకుగా కూడా కృష్ణుడిని ‘నందనందనా!’ అని సంబోధిస్తారు. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా.. అందరూ సుఖపడాలి నందనందనా!’ అని పాట కూడా ఉంది కదా. సంవత్సరాలను అరవైగా నిర్ణయించి, వాటికి ప్రభవాది నామాలు మన కాలగణనంలో ఇచ్చారు. ఈ అరవై సంవత్సరాలూ తిరిగి పన్నెండు భాగాలుగా చేశారు. అయిదు సంవత్సరాలు కలిసి ఒక్కో భాగం. దానికి ‘ఖండ యుగం’ అని పేరు. ‘నందన’ ప్రభవాదుల్లో 26వది కాగా, నందన, విజయ, జయ, మన్మధ, దుర్ముఖి అనే అయిదు సంవత్సరాలూ కలిసి ఒక ఖండ యుగం. ఇవి ఆహిర్బుధ్న్య దేవతాకములు. ఈ ఖండ యుగానికి ఆది ఉగాది - ‘నందన’ నామ సంవత్సరమే. ఇందులో మొదటి మూడు హితకరములు, శుభకరములూనట!
తరతరాల తెలుగు సంస్కృతికి ప్రతీక - ఉగాది. ‘కలౌషష్టిర్విధీయతే’ అని కలియుగంలో 60 సంవత్సరాలు జీవించడం పరమావధి. దానికి అనుగుణంగా వచ్చిందే షష్టిపూర్తి. ఉగాది క్కూడా 60 సంవత్సరాలు. 1952లో నందన వచ్చింది. ఇప్పుడు ‘నందన’కు షష్టిపూర్తి అన్నమాట. ‘ఉ’ అంటే ఉత్తమమైన ‘గ’ అంటే జ్ఞానం అనే అర్థంలో - సృష్టిలో మొదట ఏర్పడింది ‘వేదం’ అనే అర్థంలో కూడా ‘ఉగాది’ అన్న భావన కూడా ఉంది.
ఉగాది రోజు ‘పంచాంగ శ్రవణం’ ఎంత ప్రాముఖ్యమైనదో గ్రహించాక, ఉగాది కాలాన్ని దైవ స్వరూపంగా భావించి ఆరాధించే పండుగ అన్నది విదితమే కదా. నేటికి అంటే నందన ఉగాది నాటికి ఈ సృష్టి జరిగి అన్ని యుగాలతో కలిపి 195,58,25,112 సంవత్సరాలైందని ఒక సిద్ధాంతం. కలియుగ సంవత్సరాలు నాలుగు లక్షల ముప్పై రెండు వేలుట! ‘ఉగస్య ఆది ఉగాది’ అనీ, ‘ఉగ’ అనగా నక్షత్రపు నడక అనీ, అర్థం ఉంది. నక్షత్రాలు నడక ప్రారంభించిన కాలం అంటే - సృష్టి కాలం. ‘యుగము’ అంటే ద్వయం లేక జంట అనే అర్థం ఉంది. ఉత్తరాయణం, దక్షిణాయణం అనే ద్వయంతో కూడిన సంవత్సరం అనే అర్థంలో కూడా ‘యుగాది’ అని ఏర్పడిందని కొందరి అభిప్రాయం.
మహిమాన్వితమైన ‘పంచాంగ శ్రవణం’ చేయడానికి అందుకే ఈ ఉగాది రోజు బ్రాహ్మీ ముహూర్తంలో - అంటే తెల్లవారుజామున ఉదయం 4.30 నుండి 5.30 లోపుగానే లేచి, నువ్వుల నూనెతో శరీరాన్ని చక్కగా మర్దించుకుని ‘అభ్యంగన స్నానం’ చేయాలి. కుంకుమ తిలక ధారణ చేసుకుని, కొత్త బట్టలు కట్టుకుని, భగవత్ప్రార్థన చేసుకోవాలి. ఫలం, పుష్పం, తోయం తమ శక్త్యానుసారం దీప ధూప నైవేద్యం కావించాలి. ఎలాంటి ఆహార పదార్థాలను తినక ముందుగానే - ‘ఉగాది పచ్చడి’ని సేవించాలి. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి కూడా - సంవత్సరంలో వచ్చే షడ్రుతువులకూ ప్రతీకాత్మకమే! ఆరు ఋతువులకూ ఆరు రుచుల ఉగాది పచ్చడీ సంకేతంగా, జీవితపు వివిధ పార్శ్వాలకు రసానుభూతి అభివ్యక్తంగా ఉంటుంది. ధర్మబద్ధమైన జీవనానందం అనుభూతి చెందడానికి - ఆరోగ్యమే ప్రధాన సాధనం. ‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్’ అన్నారు. ఉగాది పచ్చడి - ఆరోగ్య పరిరక్షణా హేతువు కూడాను. ఉగాది పచ్చడిలో కలిపే వేప పువ్వు, మామిడికాయ ముక్కలు, కొత్త బెల్లం, ఉప్పు, జీలకర్ర, చింతపండు మొదలైనవన్నీ ఔషధీ గుణాలు కలిగినవే. ఈ ఔషధులకు గల పేర్లు, వ్యుత్పత్త్యర్థాలు ఆ విషయాన్ని స్ఫుటంగా తెలుపుతాయి-
ఆరోగ్యం నయతీతి ‘నింబః’ - అనగా వేప
గుడతి రక్షతీతి ‘గుడం’ - అంటే బెల్లం
లునాతివాతం జాడ్యంవా ‘లవణం’ - అంటే ఉప్పు
సహస్రరోగాన్ విధ్యతే ఇతి ‘సహస్రవేధి’ - అంటే చింతపండు
జీర్యతే అన్నమనే నేతి ‘జీరకః’ - అంటే జీలకర్ర
సహకారయతి మేళయతిస్ర్తి ‘సహకారః’ - అంటే మామిడి.
ఇలా... వేప ఆరోగ్యాన్ని, బెల్లం రక్షణను, ఉప్పు వాత, మాంద్యాల హరణను, చింతపండు పలు రోగ నాశకంగానూ, జీలకర్ర అజీర్ణం పోగొట్టేదిగానూ, ఇక మామిడి స్త్రీ పురుషుల కలయికకు ఉపయోగపడేదిగాను భాసిస్తూ ఉన్నాయి. గర్భిణి పుల్ల మామిడి ముక్కలు తినాలని కోరుకోవడంలోని ఆంతర్యమూ అదే!
శాస్త్రాలలో వేప పూత పచ్చడిని ‘నింబకుసుమ భక్షణం’ అని చెప్పారు. లేత మామిడి చిగురు, అశోక వృక్షం చిగుళ్లు, వేప పూత, కొత్త బెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడి, చెరుకు ముక్కలు కలిపి ఉగాది పచ్చడి చేస్తూంటారు. అలా ఉగాది పచ్చడిని సేవించి పంచాంగ శ్రవణం చేయాలనేది సంప్రదాయం!
ఇంత పవిత్రమైన ఉగాది సంబంధిత వైనం ఈ కాలాన దిగజారుతున్న విలువలతో పరిహాసాస్పదం కావడం శోచనీయం. ‘పచ్చడి చేయడం’ అనేది హింసాత్మక చర్య పదంగా, ‘పంచాంగ శ్రవణం’ అంటే - అసెంబ్లీలో రాజకీయ నేతల పరస్పరారోపణల బూతు మాటలుగా, ‘ఉగాది’ అనేదే ‘ఉట్టి-అడ్డ-గాడిది’ అనే నైజానికి సంక్షిప్తీకరణంగా చెలామణీ కావడం నేటి విడ్డూరమే!
కాలగణన పర్వం అయిన ఉగాది వైశిష్ట్యాన్నీ, పండుగలోని పరమార్థాన్నీ గ్రహించి, నక్షత్ర జ్ఞాన వివేచనం అందుకోగల్గినప్పుడు - ఈ పెడ ధోరణులు దరిచేరవు! ‘నందన’ ఆనంద స్యందనగా తులతూగాలనీ, బ్రతుకు ఆనంద నందనోద్యానంగా విరాజిల్లాలనీ, అందరికీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో... స్వస్తి!! *
(18/03/2012 )
No comments:
Post a Comment