ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Thursday 21 July 2011

దాశరథి జయంతి స్మృతిగా...



22 జూలై దాశరథి గారి జన్మదినం.

ఉర్దూ లోని రుబాయి సొగసులను తొలిసారి తెలుగుకు అందించిన వారు ఆయనే.
ఆయనతో పరిచయం మరచి పోలేనిది.


యువకులుగా వున్న మమ్ములని ఆయన ఎంతో ప్రోత్సహించేవారు.


26 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా 
హైదరాబాద్ రవీంద్రభారతి లో జరిగిన ఒక కవిసమ్మేళనంలో
ఆయన హాస్య చతురోక్తులతో కూడిన రుబాయిలను వినిపించడం నాకు బాగా గుర్తు.


1973 సెప్టెంబర్ 9 వ తేదీ
ఈ రుబాయీ ప్రక్రియగురించీ,మరికొన్ని కవిత్వపు విషయాల గురించీ

దాశరథి గారితో నేను,కోపల్లె శివరాం,కుమారి చిత్రపు శాంత
ఆకాశవాణి హైదరాబాద్ 'బి 'కేంద్రం యువవాణి లో చేసిన పరిచయ కార్యక్రమం
ప్రసారమైన ఆనందం ఎప్పటికీ మరచి పోలేనిది.


15 ఆగస్ట్ 1973 న రవీంద్రభారతి కవి సమ్మేళనంలో  ఆయన చదివిన రుబాయిలు
వారి ఏ పుస్తకంలోనైనా వచ్చాయో లేదో నాకు తెలియగానీ
మీ కోసం ఆ కవితలు ఇవిగో....




దాశరథి రుబాయిలు


కళ్ళెం వున్నది మనచేతిలో
గుర్రం మాత్రం పడె గోతిలో
దప్పి తీరదని నేనంటాను
నీళ్ళేలేని మన నూతిలో





పడవ నడపలేని వాడు నావికుడు
పాట పాడలేనివాడు గాయకుడు
అందుకనే వేదనతో నేనంటాను
ప్రజల నడపలేనివాడు నాయకుడు





పైపై సొగసులు కల్ల సుమా
లోపలిదంతా డొల్ల సుమా
నిజం తెలియమని నేనంటాను
లేదా కొంపే గుల్ల సుమా





నింగిని కితాబుగా చేశాను
చుక్కల హిసాబులు వేశాను
ప్రేయసికోసం వేచీవేచీ
తుదకు మంచమే నేసాను





బండను కోయాలి కుసుమ దళం
గుండెను కోయాలి నయన జలం
కదనరంగమున నేనంటాను
కత్తిని మించాలి కవుల కలం





నవభాష్పధారలో నవ్వు కాగలవు
ముళ్ళతీగెలలోన పువ్వు కాగలవు
యత్నించి చూడమని అంటాను నేను
రాళ్ళ రాసులలోన రవ్వ కాగలవు





నిన్నటి ధర రెండింతలు పెరిగింది నేటి ఉదయం
మొన్నటి ధర మూడింతలు పెరిగింది సాయంత్రం
అన్నింటి ధర పెరిగినా నేనంటాను
ధర పెరుగని సరుకొకటే మానవ ప్రాణం



డబ్బుకొరకు గడ్డి తినని రోజుల కోసం
వెలకై రవళించబోని గాజుల కోసం
అందరమూ కృషి చేయాలంటా నేను
అట్టడుగున వున్న జనుల మోజుల కోసం





కోటి నదులు పోలలేవు ఒక్క సింధువుని
కోటి తారలు పోలలేవు లోక బాంధవుని
అందుకనే గళం విప్పి నేనంటాను
కోటి నేతలు పోలలేరు ఒక్క గాంధీని





ఏసును శిలువకు పంపినవారు ఇంకా వున్నారు
బాపు గుండెలు చెండిన వారు బహుగా వున్నారు
అంతటితోనే అయిపోలేదని అంటా నేను
తలిదండ్రులనే తునిమే తనయులు ధరలో వున్నారు





ప్రభుతకు సమతకు నడుమన గోడలు పెట్టారు
జనతను ఆర్థిక బందిఖానలో నెట్టారు
పెట్టుబడుంటే గిట్టుబడుండును ధనికులు అది కనిపెట్టారు
జనతను దోస్తూ సమతకు జేజే కొట్టారు





బిరుదూ సనదూ ప్రతి మానవుడికి కావాలి
పదవీ హోదా ప్రతి పౌరుడికీ కావాలి
ప్రభుత మెప్పునూ బడసిన పిమ్మట ఏం కావాలి
ప్రజల మెప్పుకై ప్రభుతను దెప్పుట కావాలి





కంఠశోషతో రానే రాదు సోషలిజం
రైతు కూలి మేధావులు కలుపుడి భుజం భుజం
ఢిల్లీ నుంచీ దిగుమతి చేసే సరుకిది కాదు
విఛ్ఛిన్నకర శక్తుల ఓడిస్తే అది వచ్చేనయ్యా నిజం నిజం





రోజొక రాజు దిగిపాయ
రాజ్యం ప్రజాళి పాలాయ
దండుగ రాజుల నమ్మిన వారికి
తండులమ్ములే కరువాయ





భారతీయులది భాగీరథి
పాకీయులది రావీ నది
నదులెట్లున్నా నేనంటాను
కలుసుకోవలె హృది ,మది





ఉత్తరానగల హిమాచలం
దక్షిణాన గల జలధి జలం
మన అందరిదని నేనంటాను
అనుభవించు స్వాతంత్ర్య ఫలం
ఐకమత్యమే మనకు బలం





వీరంగం వేస్తూంటే రాదు విప్లవం
తారంగం పాడుతుంటే రాదు సమరథం
అందుకోసమే నేనంటాను
ఏ లేహ్యం తిన్నాగానీ రాదు యౌవ్వనం





రక్తం నదులై పారకపోతే రాదా రెవల్యూషన్
బుర్రలు బుర్రలు పగులక లేదా సమస్యకు సొల్యూషన్
హింసా యుద్ధం ఔట్ డేటెడ్ అని నేనంటాను
శాంతి ఒక్కటే మానవజాతికి సాల్వేషన్

5 comments:

  1. ధన్యవాదాలు గురూజీ! స్వారి పద్యం చాలా నచ్చింది. నేను దాశరధి గారి సాహిత్యం ఇంకా చదవలేదు. ఇప్పుడు చదవాలని ఉంది. గుర్తుచేసినందుకు ధన్యవాదాలు మరోసారి.

    ReplyDelete
  2. అధ్బుతం సుధామ గారూ ! దాశరధి గారి జ్ఞాపకాలను, రుబాయిలను అందించి ఆయనకు ఘనా నివాళి అర్పించారు. ఆయన కవితకు మరణం లేదు. మీతోబాటు నేను కూడా ఆ మహాకవికి కవితానీరాజనాలు ఆర్పిస్తున్నాను.

    ReplyDelete
  3. మెదడులో అగ్ని పర్వతాలు , మనసులో అమృత కలసాలూ దాచుకుని మానవతా విలువలని సాహిత్యీ కరించిన మహోన్నతుడు శ్రీ దాశరథి గారు.
    ` మీతోబాటు నేను కూడా ఆ మహాకవికి కవితానీరాజనాలు ఆర్పిస్తున్నాను'.

    ReplyDelete
  4. సుధామ గారు: చాలా బాగున్నాయి ఈ రుబాయిలు. ఈ రుబాయిలు పుస్తకంగా వచ్చాయా? అప్పుడు జ్యోతి మాస పత్రికలో వచ్చినట్టు గుర్తు!

    రెండు భాషల రహస్యాలు తెలిసిన కవి దాశరథి. ఈ రుబాయిల్లో నాకు నచ్చింది అదే!

    ReplyDelete
  5. సుధామ గారు,
    మీ జ్ఞపకాలతో పాటూ చక్కని రుబాయిలను అందించారు. ఏదైనా పుస్తకం ప్రచురించినప్పుడు మామయ్య మాకు ఒక కాపీ పంపించేవారు. అది రాగానే మా నాన్నగారు మాకు చదివి వినిపించేవారు. ఆయనకు నచ్చినవి, మాకు నేర్పించేవారు,
    'కళ్ళెం వున్నది మనచేతిలో
    గుర్రం మాత్రం పడె గోతిలో
    దప్పి తీరదని నేనంటాను
    నీళ్ళేలేని మన నూతిలో' ఇలాంటివి. మొన్న నేను మా పాపకి చదివి వినిపించాను ఇవన్నీ! థ్యాంక్స్ సుధామ గారు మంచి రుబాయిలు రాసినందుకు.

    ReplyDelete