"అలాగని పెద్ద బాధా లేదు....అన్నాడాయన...."
‘‘ఆయనకు కాదు, ‘బాధ’ మనకు! హృదయం కొట్టుకుంటూండగానే మెదడు మరణించి, ఆ పై ‘కాలం’ చేయడంలో కూడా ‘బతికిన క్షణాలు’ లోని ‘రహస్తంత్రి’ని త్రెంపుకుని, చితి చింతలో ‘చింత’ మనకు మిగిల్చి, చివరకు తాను ‘చితియై పోయాడు. ‘‘ఎ పొయట్ ఈజ్ ఎ పెయింటర్ ఆఫ్ ది సోల్’’, ‘‘ఎ పొయట్ ఈజ్ ది ట్రాన్సలేటర్ ఆఫ్ ది సైలెంట్ లాంగ్వేజ్ ఆఫ్ నేచర్ టు ది వరల్డ్’’ అన్న మాటలకు సాక్షీభూతుడుగా నిలిచేవాడు తను’’.
వేగుంట మోహన్ ప్రసాద్ మరణించాడని కవిమిత్రులే కాదు, పాఠకలోకం కూడా పరితపిస్తోందనడానికి అక్కడ గ్రంథాలయం దగ్గర సంభాషణలు వినిపిస్తున్నాయి.
‘‘మానిషాద నుండి, మో ‘నిషాదం’ వరకు బాధే కవిత్వానికి పర్యాయమర్రా! ‘మో’ కవిత్వం అర్థం కాదని కొందరి బాధయితే, ‘మో’ వలె ఎందుకు అలా ‘సాంధ్యభాష’ను పలకలేకపోతున్నా‘మో’, అని కొందరి కవుల బాధ! తెలుగు కవితకు పాశ్చాత్య స్థాయి ‘విగర్’నూ, ఒక గౌరవాన్ని, ఉదాత్తతనూ అద్దిన కవి ఆయన’’ అన్నాడు సన్యాసి.
‘‘ ప్రముఖ రచయత ,నటుడు తనికెళ్ళ భరణి నెలకొల్పిన ప్రతిష్ఠాత్మక కవితా పురస్కారాన్ని మొదటగా ‘మో’ అందుకుని - నెలయినా కాలేదు. మొన్న మొన్న దాశరధి జయంతి రోజు ,కేంద్ర సాహిత్య అకాడమీ సహకారంతో లావణ్య ఆర్ట్స్ ప్రభాకర్ ఏర్పాటు చేసిన కవి సమ్మేళనానికి వచ్చి తన మధ్యాహ్నపు నిద్ర అవాంతరాలను కవితగా విన్పించి, విశ్వేశ్వర్రావ్ షష్ఠిపూర్తి కని- టి.ఎస్. ఎలియట్ 'వేస్ట్‌లాండ్'కు ,ఖాదర్ మొహియిద్దీన్ చేసిన తెలుగు ‘చవిటపర్ర’కు టీకాటిప్పణి తాను సంతరించి, ఆ పుస్తకాలను వచ్చిన వారందరికీ ఉచితంగా పంపిణీచేసి, శివారెడ్డి నుండి సుధామ దాకా అందరితో ఆప్యాయంగా కబుర్లాడి, ఇప్పటికీ తాను గళ్ళ నుడికట్టులు నింపడం చేస్తూ మెదడునీ, భాషనీ ‘షార్ప్ చేసుకుంటున్నానంటూ కబుర్లు చెప్పిన వాడు - ఇంతలోనే బ్రెయిన్ హెమరేజ్‌తో శాశ్వత నిద్రలోకి సంగమిస్తాడని ఎలా అనుకుంటాం’’ అన్నాడు రాంబాబు చెమ్మగిల్లిన కనులు తుడుచుకుంటూ....
‘‘తెలుగు కవిత్వంలో ‘మో’ది ఒక విలక్షణ ముద్ర. అనుభూతి, అనుభవాల్లో తనను తాను ‘అనుభవవాద కవి’గా చెప్పుకుంటాడు. ఏడు కవితా సంపుటాలు, మూడు వ్యాస సంపుటాలు, అనేక అనువాదాలు, వెలువరించిన మోహన ప్రసాద్ విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఇరవై సంవత్సరాలు ఆంగ్లోపన్యాసకునిగా ,ఎందరినో సాహిత్యాసక్తిగల విద్యార్థులుగా మలిచాడు. విజయవాడ, ఆకాశవాణిలో ‘మో’ షేక్స్‌పియర్ నాటక కథలను ,‘కథా లహరి’లో అందించగా, కోకా సంజీవరావ్ గళంలో ఆ కథలు శ్రోతలను అలరించాయి. అది గ్రంథ రూపంలో కూడా ఆ తరువాత వచ్చింది. తెలుగు కవులను ఆంగ్ల పాఠక ప్రపంచానికి పరిచయం చేయడంలో ,మో ‘ది టెన్స్ టైమ్’ అనువాదాలు, విశిష్టమైనవిగా నిలిచేవిగా ఉన్నాయి’’ అన్నాడు ప్రసాదు....
‘‘కవిత్వానికే కాదు కరచరణాలకు స్పెల్లింగులు చెప్పినవాడు. బుడమేరు రాళ్ళనూ, బ్రిటిషిండియా పుస్కాలనూ పుక్కిట పట్టినాడు. చితిచింతడు, మానిషాదుడు. ఆయనకి ఏ పరిచయవాక్యమైనా చిన్నదే. వాక్యానికి లొంగని మనిషి, మమతకు మాత్రమే లొంగే నాన్న, ఆంధ్రానికి ఆంగ్లత్వాన్ని, ఆంగ్లానికి ఆంధ్రత్వాన్నిచ్చి - అంధత్వాన్ని తుడిచేసిన కవి. ఏక ‘మో’, ఏకైక ‘మో’’’ అన్న సమకాలీన కవితల కాలనాళిక ‘కవితా!’లో ఆయన పరిచయం ప్రత్యక్షర సత్యం! సీతారాం లాంటి వారు ‘మో’కి ప్రత్యక్ష శిష్యులు లాంటివారు. తన చివరిదైన కవితా సంకలనం ‘నిషాదం’కు ‘మో’ -‘సీతారాం’ చేత ముందు మాట రాయించడం విశేషం’’ అన్నాడు సన్యాసి.
‘‘గ్రీక్, రోమన్, యూరోపియన్ కవిత్వాలను, ఆపోశన పట్టి, తన పుస్తకాలను చదివిన వారు తెలివైన వారు కావాలని ,కవిత్వాన్ని ఒక మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్‌గా అందించాలనీ, ప్రయత్నించిన వాడాయన! ఒక ‘డాలీ’ పెయింటింగ్ చూసినట్లుగా, సర్రియలిస్టిక్ ఎక్స్‌పీరియన్స్‌ను పఠితలకు ఆయన అందించాడు. ఆయన మేనల్లుడు బాబు - తన తల్లి, అంటే ‘మో’గారి చెల్లి మరణించినప్పుడు, ‘మో’తో సంప్రదించి ,ఆమె అవయవాలను, మరి అయిదుగురికి జీవం పోసేలా, అవయవదానం చేసాడంటే అందుకు ప్రేరణ కూడా ‘మో’యే! జీవితమూ, కవిత్వమూ మిళాయించి, తన వైయక్తిక అనుభూతులకూ, అనుభవాలకు కవిత్వ శరీరాన్ని ఇచ్చి, ఒక ప్రాణవత్ చైతన్యాన్ని తద్వారా అక్షరీకరించిన కవి వేగుంట మోహన్ ప్రసాద్. ఇప్పుడు యూనివర్శిటీ అయినా, ఒకప్పుడు ‘‘సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీషు అండ్ ఫారిన్ లాంగ్వేజెస్’’గా ఉన్న హైదరాబాద్ ఇనిస్టిట్యూట్‌లోనే ఆయన డిప్లమోకోర్స్ చేస్తూ ,తన తొలి కవితను 1960లో భారతిలో వెలువరించారు. బ్రిటిష్, ఫ్రెంచ్, రష్యన్ కవిత్వాలతో తానెక్కువ ప్రభావితుడనని చెప్పుకునేవారు. రిటైరయ్యాక కూడా కొంతకాలం ద్రవిడ యూనివర్శిటీ అనువాద విభాగం డైరెక్టర్‌గా పని చేశాడు. ఆక్స్‌ఫర్ట్ యూనివర్శిటీ ఆయన అనువాద నవలను ఈ సెప్టెంబర్ నాటికి ప్రచురించబోతోంది కూడా! కవిగా ఆయనది విజయ‘మో’, వీర స్వర్గ‘మో’ కాలానికి నిలుస్తుంది’’ అంటూ అంజలి ఘటించాడు రాంబాబు.
సుధామ గారూ !
ReplyDelete" ‘‘ఆయనకు కాదు, ‘బాధ’ మనకు! హృదయం కొట్టుకుంటూండగానే మెదడు మరణించి, ఆ పై ‘కాలం’ చేయడంలో కూడా ‘బతికిన క్షణాలు’ లోని ‘రహస్తంత్రి’ని త్రెంపుకుని, చితి చింతలో ‘చింత’ మనకు మిగిల్చి, చివరకు తాను ‘చితియై పోయాడు. "
***********
' మో ' గారి జ్ఞాపకాలను అందించిన మీకు ధన్యవాదాలు. ఆ సాహితీమూర్తికి నివాళులతో......