ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Friday 9 September 2011

'తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం '






చిలిపి కుంచెను పట్టి
శ్రీకారమును చుట్టి
నవ్వించె తలిశెట్టి
ఓ కూనలమ్మా!


ఆది కార్టూనిస్ట్
అనుచు తలుచుచు ఫస్ట్
కీర్తించుటే బెస్టు
ఓ కూనలమ్మా!


అన్నారు ఆరుద్ర గారు.


తలిశెట్టి రామారావు గారి కార్టూన్లు భారతి మాసపత్రికలో 1930 ప్రాంతాల్లో విరివిగా ప్రచురింప బడ్డాయి. అయితే ఆయన కార్టూన్లు ఈ తరం వ్యంగ్యచిత్ర కారులు ఎక్కువ చూసే అవకాశం కలుగలేదు. ఆ లోటు తీరుస్తూ శ్రీ ముల్లంగి వెంకట రమణారెడ్డి గారు కేవలం సాహిత్యం పట్ల,తలిశెట్టి వారి కార్టూన్ల పట్ల వున్న ఆసక్తితో వారి వ్యంగ్య చిత్రాలు ఎన్నో సేకరించి  గ్రంధంగా ప్రచురించారు.


'తలిశెట్టి రామారావు -తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు' ఇప్పుడు పుస్తకంగా లభిస్తోంది.




ఈ రోజు (9.9.2011)'ముఖీ మీడియా 'పక్షాన ప్రముఖ కార్టూనిస్ట్ ' బ్నిం' రమణారెడ్డి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ క్రోక్విల్ అకాడెమీ వ్యవస్థాపకులు ప్రముఖ కార్టూనిస్ట్ శంకు,'కినిగె' ఈ- బుక్స్ అనిల్ అట్లూరి, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ వంగీపురపు.ఆర్.కుమార్ ప్రభృతులతో, నేనూ ఆ సమావేశం లో పాల్గొనడం ఆనందం కలిగించింది.


ఈ సందర్భంగా తలిశెట్టి వారి గురించి విశ్లేషిస్తూ చిన్న ప్రోగ్రాం దృశ్యీకరించడం విశేషం.


మరో ఆనందకర విషయం ఇకనుంచీ ప్రతి ఏడాదీ తలిశెట్టి వారి జన్మదినమైన మే 20 వ తేదీని 'తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం ' గా పాటించాలని ప్రతిపాదించడం జరిగింది. దీనికి కార్టూనిస్టుల అందరి ఆమోదం లభించగలదని భావన.


వచ్చే ఏడాది మే 20 నాటికి తలిశెట్టి వారిపై శంకు ఒక డాక్యుమెంటరీ తీస్తానని ప్రకటించారు.దీనికి తగిన సామగ్రి అందచేస్తానని రమణారెడ్డి గారు ముందుకొచ్చారు.


తలిశెట్టి వారి కుమారులైన డాక్టర్.జైరాం గారు రమణారెడ్డి గారికి పరిచయం కావడం ,వారు తలిశెట్టివారి ఫొటొ ఒరిజినల్ ఇవ్వడం మాత్రమే కాక ఆయన వేసిన, ఇప్పటి సంకలనంలో లేని అదనపు కార్టూన్లు,వారి వ్యాసాలు కూడా ఇవ్వడం ఒక శుభ పరిణామం.


తలిశెట్టి వారి వర్ధంతి 14.మార్చి 1947 అని ఆనందవాణి పత్రిక లో నేను స్వయంగా చూశాను. ఆనందవాణి కి చెందిన శ్రీ ముద్దా విశ్వనాధం గారు 'వ్యంగ చిత్రాలతో దివ్య సందేశాలిచ్చిన మన త.రా తరలి పోయారు 'అని శ్రద్ధాంజలి ఘటించారు.ఆ విషయం నేను తెలిపి మార్చి 3 అని పొరపాటు గా నమోదయిన వర్ధంతి తేదీని కూడా సవరింప చేయడం జరిగింది.


ఏమైనా రమణారెడ్డి గారు తీసుకుంటూన్న శ్రద్ధ మనమంతా అభినందించదగింది.


               తలిశెట్టి రామారావు గారి జయంతి అయిన 20 మే ఇక పై తెలుగు కార్టూనిస్టుల దినోత్సవంగా చరిత్రాత్మకమవుతుందని మనసారా ఆకాంక్షిద్దాం.


తెలుగు కార్టూనిస్టులు అందరూ దీనికి తమ సంఘీభావం తెలుపుతూ శంకు గారికి గాని,బ్నిం గారికి గాని తమ ఆమోద లేఖలు పంపవలసిందిగా ప్రార్థన.తెలుగు కార్టూనిస్టుల డాట్ కాం కు తెలియజేసినా శ్రీ పుక్కల రామకృష్ణ గారు దోహదం చేస్తారు అన్నది అందరి విశ్వాసం.


అందరికీ నమస్సులతో..

సదా మీ..
సుధామ.
 

మచ్చుకు తలిశెట్టి వారి ఓ కార్టూన్


No comments:

Post a Comment