ఇష్టపడి చేసుకున్న సంబంధానికీ, పెద్దలు కుదిర్చిన సంబంధానికీ తేడా వుంటుంది. ఇష్టపడి చేసుకున్నవన్నీ విజయవంతాలవుతాయనిగానీ, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు ‘పెటాకులు’ అవుతాయని గానీ నిర్ధారించలేం! ఏమయినా ‘సంబంధాలు’ పెట్టుకున్నప్పుడు, అవి సజావుగానూ, పటిష్టంగానూ, విశ్వసనీయంనూ, ధర్మబద్ధంగానూ, వుండాలనే అభిలషిస్తారు. ‘బంధం’ అన్న మాటలోనే ‘ముడివడడం’ వుంది.ఇంతకీ ‘బంధం’ అనేది- వ్యష్టి నుండి సమష్టి వైపు పయనించడం. వివాహం అనేదాన్ని కూడా సామాజిక దృక్పథంలో వ్యక్తి శక్తిగా మారడంగానే పరిగణిస్తారు.
ఇంతకీ ప్రేమ, విశ్వాసం, పరస్పర అవగాహన అనేవి ‘సమష్టి’కి అత్యంత ఆవశ్యకాలయిన విషయాలు. మిగతావి ఏవయినా అనుషంగికాలే! ఒక భాష మాట్లాడేవారంతా సమష్టిగా ఒకచోట వుండడం బాగుంటుందన్న సిద్ధాంతం మీద, భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన భారత దేశపు తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా నిజాం నిరంకుశ పాలనలో మ్రగ్గుతున్న తెలుగువారికి స్వేచ్ఛ లభించడానికి విమోచనోద్యమం జరిగింది. తెలుగు భాషనీ, తెలుగుతనాన్నీ నిజామ్ నిర్బంధాలనుంచి ఛేదించుకు వికసింపజేసుకోవడానికి, తెలంగాణలో జరిగిన పోరాటానికి, ఎక్కడి తెలుగువారయినా మద్దతు పలికారు. నిజాం నిరంకుశత్వంలోనే తమ సోదరులు మ్రగ్గి పోవాలని వారు కాంక్షించలేదు. అండదండ, వెన్నుదన్ను అయ్యారు.
‘ ఆది కాలమున అందరు జనులు అన్నదమ్ములండీ
నదులు వనంబులు నానామృగములు నాల్గుసంద్రములను
కొండలు బండలు జలములు పొలములు గుంటలు సెలయేళ్ళు
కాయలు పండ్లు పాడిపంటలు ఘనమయినా యిండ్లు
అంతరువులా భేదముల లేక అందరి సొమ్మండీ’- అంటూ
కీర్తిశేషులు ఉన్నవ లక్ష్మీనారాయణగారు రాసిన ‘మాలపల్లి’ నవలలో ఒక బుర్రకథ దళం ప్రబోధించిన సమతాధర్మం. ఆదికాలంలో సమష్టిజీవనం వుండేదనేది నిర్వివాదాంశం. ప్రకృతితో పారాడడానికి పెనుగాలులు, తుపానులు, అడవి మృగాలనే గండాలనుండి అధిగమించడానికి సమష్టిగా శ్రమించక తప్పని మార్గం నాడుండేది. నిజానికి మొదట్లో ‘భాష’కూడా లేదు కదా.
‘భాష’ అనేది భావ వినిమయ సాధనంగా వికసించింది. మూకీ చిత్రాలు టాకీ చిత్రాలుగా మారినప్పుడు ‘ప్రపంచ భాష అయినమౌనంముక్కలైపోతోంద’ని ప్రముఖ హాస్యనటుడు ఛార్లీ ఛాప్లిన్ కంటతడిపెట్టాడట. భాషాప్రయుక్త రాష్ట్రాలనే ప్రతిపాదన మొదట గాంధీగారిదేననీ, ఆ తర్వాత నెహ్రూ దానికొక రూపకల్పన చేసారని అంటారు.హిందీ మొదలైనవి ఆర్యభాషలుగా, తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, వంటివి ద్రావిడ భాషలుగా గుర్తిస్తున్నాం. ఉత్తరాదివారిని ఆర్యులుగా, దక్షిణాదివారిని ద్రవిడులుగా మౌలికంగా భావించడం వుంది. హిందీ మాట్లాడే వారి సంఖ్య అధికం అంటూ- పాలనా సౌలభ్యం కోసం వివిధ రాష్ట్రాలుగా అంగీకరించి, కేవలం తెలుగు, తమిళ, కన్నడం వంటి భాషలు మాట్లాడేవారిని ఒకటిగా చేర్చి ఒకే భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పరచాలన్న ఆలోచన ఆనాటిది. అప్పట్లో తెలుగువారు మూడుకోటులే. ‘మూడుకోటుల నొక్కటే ముడి బిగించి’, ‘మహాంధ్రోదయాన్ని’- నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాహిత్యంలోను ఉద్యమించిన దాశరధి ఆహ్వానించాడు.
తెలుగువారందరికీ ఒకే రాష్ట్రం ఏర్పరచడం, ‘విశాలాంధ్ర’ ప్రాతిపదిక ఏర్పడడం జరిగినప్పుడు, తెలంగాణ ప్రాంతపు తెలుగువారిని ఇతర ప్రాంతపు తెలుగువారితో కలపడాన్ని నెహ్రూగారు అన్నదమ్ముల సంబంధంగా కాక భార్యాభర్తల సంబంధంగా అంటూ- ‘అమాయకపు భార్య- గడసరి భర్తను ముడివేస్తున్నామనీ, ఈ బంధం ఎంత కాలం పటిష్టంగా వుంటుందో తెలియదని, మున్ముందు విడిపోతే విడిపోవచ్చు అన్నారని ప్రచారంగా వినిపిస్తున్న మాట ఒకటుంది! అప్పుడు కూడా రాజకీయాలు ఎన్నో నడిచాయి! ‘ఆంధ్రప్రదేశ్’ ఏర్పడటం వెనుక కథ ‘ఆంధ్రుల కథ’లో నిర్దుష్టంగా తెలుస్తూనే వుంది.
అప్పుడు ఆంధ్ర, తెలుగు అనే పదాలు పర్యాయాలుగా భావించబడ్డాయే తప్ప ‘వేర్వేరు’ అన్న భావన లేదు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అన్న విభజన, ప్రాంతాలను బట్టిగానీ, భాషాపరంగా, మూడూ ‘తెలుగు’ భాష మాట్లాడేవే. ‘తమిళనాడు’ లాగా- ‘తెలుగునాడు’ అని ఆనాడే పేరు పెట్టివుంటే ఎలా వుండేదో మరి? రానురాను ‘ఆంధ్ర’ అనేది మాత్రమే కాదు, తెలంగాణలో ‘తెలుగు’ అనే పదానికి వైమనస్యం మొదలైంది. ‘తెలుగుతల్లి’ అన్నపదం కూడా నచ్చని వైఖరి ఎందుకొచ్చిందో పూర్తి వివరణ లభించనేలేదు అన్న భావన వుంది.
అన్నదమ్ముల బంధం అంటే-విడిపోవడం, ఆస్తుల పంపకం అనే మాట రావచ్చు. కానీ నెహ్రూగారు భార్యాభర్తల బంధం అన్నారు. భారతీయ వివాహవ్యవస్థ-వట్టినే విడాకులు కోసం వెంపర్లాడేది కాదు ! మైక్రోఫ్యామిలీలు పెరుగుతున్న నేటి కాలంలో మానవ సంబంధాలలో-ఉమ్మడి కుటుంబం గురించీ, అన్నదమ్ములూ, కుటుంబం యావత్తూ కలిసివుండటంలోని ఉదాత్తత గురించీ, ఏప్రాంతపు కవులూ, రచయితలైనా మానవీయ విలువల గురించి ఆరాట ప్రకటనం చేస్తూనే వున్నారు. అటువంటప్పుడు ఒంటెద్దు పోకడలు వ్యవసాయాన్నైనా కుంటుపరచేవేగా! ‘యాంత్రికత’ ప్రయోజనాలన్నింటినీ పొందుతూనే, మనిషి మాత్రం ‘యంత్రం’గా మారిపోరాదని ఆరాట పడుతున్నామాయె!
భార్య అయినా అమాయకంది అయినా- భర్తని తన అనురాగంతో చెప్పుచేతల్లో వుంచుకోగలదు. ఎంతటి గడసరి, మేధావి అయిన భర్త అయినా, ‘దురంత పద్మవ్యూహాల వల్ల కానిది రవంత అనురాగం వల్ల అవుతుంది’ అని ‘సినారె’ అన్నట్లు, భార్యా విధేయుడుగా వుండడం లోనూ వైచిత్రి లేదు. అసలు భార్య దృష్టిలో భర్తే అమాయకుడు. తను ‘నీడపట్టు మనిషి’ కావడం వల్లనే మొగుడు ఏదయినా సాధించగలడు! ఇంతకీ భార్యకోసం కష్టించే భర్తలు లేరా? ‘భార్యా భర్తల బంధం’ అంటే నిజానికి అది మరింత పటిష్టంగా వుండాలన్న సూచనే వుంది గానీ, చీటికీ మాటికీ కాట్లాడుకుని పుట్టింటిని ఆశ్రయించడాలూ, మొగుడిని కొట్టి మొగసాలకెక్కడాలూ మన సంస్కృతిలో ప్రోత్సహింపబడలేదు. అన్నదమ్ములన్నా,భార్యాభర్తలన్నా పరస్పర బంధం గురించే మానవీయంగా ఆలోచించడం జరుగుతుంది కానీ, వైషమ్యాల గురించి కాదు.
నిజమే! ‘సెంటిమెంట్స్’ బలీయమైనవి. ‘ఆత్మగౌరవం’ ప్రధానమైనది. పరస్పరం ప్రేమ, విశ్వాసం ఒకరి కోసం ఒకరు-ఒకసారి ఒకరైతే, మరొకసారి మరొకరు- ‘అడ్జస్ట్’ అవుతూ, గిల్లికజ్జాలను చిలికి చిలికి గాలివానల్లా పెంచుకోక, పరస్పరాభిప్రాయాలను గౌరవించుకుంటూ, ఒకరి అభ్యున్నతికి మరొకరు దోహదపడుతూ సాగడమే ఉదాత్తమైన ఆశ, ఆశయం. కానీ వ్యవస్థ అంతా సజావుగా సాగితే అవస్థలు దేనికి?
గుంపులు గుంపులుగానే మబ్బులు కొండను ఢీకొంటే వర్షం కురుస్తుంది. అలలు అలలుగానే సముద్రం ముందుకురికితే పడవ సాగుతుంది. జ్వాలలు జ్వాలలుగానే నిప్పు ఆహారాన్ని పచనం చేస్తుంది. తారలు తారలుగానే ఆకాశం చంద్రునితో వెలుగు వెన్నెలని పరుస్తుంది. పొరలు పొరలుగానే నేల సారవంతమైన పంటలనిస్తుంది. ‘కలయిక’లో ఇంతకలిమి, సమష్టిలో ఇంత అభివృద్ధి వుండడం చూసి కూడా వేరు పడటం కోసం మనుషులు గుంపు కట్టారంటే ఆలోచించవద్దా? కలుసుకోవడం విడిపోవడం కోసమే అయితే ‘అవతరణ’ విచ్ఛిన్నం కోసమే అయితే, విడిపోయాక కలుసుకోవడం కోసమూ, ఆరాటపడటం అంతే సహజమని, కవులు, రచయితలు, మానవ సంబంధాలు గూర్చిన ఆలోచనలు మరోమారు అర్థం చేసుకునేలా చేస్తుంటాయి.
సంసారాల్లో నిప్పులు పోయాలని చూసేవారూ ఉంటారు. సామరస్య జీవనం కోసం ‘మ్యారేజ్ కౌన్సిలింగ్’ చేసేవారూ వుంటారు. కలిసి వుండాలా, విడిపోవాలా తేల్చుకోవలసింది వారిద్దరే. విడాకులు పుచ్చుకోకుండానే విడివిడిగా బ్రతికేవారూ వున్నారు. లీగల్‌గా విడిపోయి సహజీవనం చేసేవారూ వున్నారు. ‘ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవడానికీ, పడగొడితే పడిపోవడానికీ’ బాల చాపల్యమయితే గ్రహించగలం కానీ, ‘నిర్ణాయకశక్తి’ నిర్దేశిస్తే, అది మేలుకేనని మేలుకోకపోతారా?
‘అవతరణ’ చరిత్ర గురించి ఇప్పుడు తవ్వుకోనక్కరలేదు. ‘గతకాలము మేలు వచ్చుకాలముకంటెన్’ అన్నది ఎంత బలీయ భావనో, ‘మంచిగతమున కొంచెమేనోయ్’ అన్నదీ బలీయమే! ఇంతకాలం ఇంతదారిని నడిచి వచ్చేసాక- ‘అభివృద్ధి’ని బేరీజు వేసుకోవడం ‘అభివృద్ధి’ గురించే ఆరాట పడటం, ఆ అభివృద్ధి ఏమార్గాన వేగవంతమవుతుందని తపించడం, స్వయంశక్తి తప్ప సహాయ సహకారాలేమే అవసరం లేదనీ, తనగురించి తనే- అంతా తానుగా చూసుకోగలననీ ఉద్వేగపడడం ఎందుకు జరుగుతోందో- అర్థం చేసుకోవాలి! బలవంతం దేనిలోనూ పనికిరాదు. ‘బలోపేతమే’ పనికివస్తుంది.
ఇంతకీ పరిణామాలేవయినా మానవీయంగా పరిమళించాలి. సామాన్యుడు సంతోషించాలి. కాళోజీ అన్నట్లు-
‘ఉదయం కానే కాదనుకోవడం నిరాశ
ఉదయించి అలానే వుంటుదనుకోవడం దురాశ’
ఏదేమయినా ‘తెలుగు మాట్లాడే దీపాలు తెల్లవార్లూ వెలుగుతుంటాయి’ అని తెలంగాణపై ‘త్వమేవాహం’ వెలువరించిన ‘ఆరుద్ర ఆశ’ చిగురిస్తూనే వుండాలని ఆశిస్తే తప్పేం కాదు.
No comments:
Post a Comment